పెద్దల భద్రతకు గట్టి చర్యలు!

9 Sep, 2013 02:17 IST|Sakshi
పెద్దల భద్రతకు గట్టి చర్యలు!


 న్యూఢిల్లీ: వయో వృద్ధుల భద్రతకు తగిన చర్యలు తీసుకోవాలని అన్ని రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం సూచించింది. వారి రక్షణకు సం బంధించి పోలీసింగ్ ఏర్పాట్లపై అత్యవసరంగా సమీక్షించి లోపాలను నివారించాలని పేర్కొంది. ఈ మేరకు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్ర హోంశాఖ పలు సూచనలు చేసింది. ఒంటరిగా నివసిస్తున్న వయో వృద్ధుల సమాచారం, నేరాలు జరిగే ఆస్కారం ఉన్న ప్రాంతాలను గుర్తించి వారికి తగిన సూచనలు చేయాలని కోరింది. స్థానిక పరిస్థితులకు అనుగుణంగా ప్రతి పోలీస్ స్టేషన్ వయో వృద్ధుల భద్రతకు చర్యలు చేపట్టి ఎప్పటికప్పుడు సమీక్షించేలా పోలీస్ ప్రధాన కార్యాలయం చర్యలు చేపట్టాలని తెలిపింది. రాత్రి, పగటి పూట కూడా పెట్రోలింగ్ నిర్వహించాలని మార్గదర్శకాల్లో సూచించింది.
 
  ధనవంతులైన వయో వృద్ధుల భద్రత పట్ల మరింత అప్రమత్తంగా ఉండాలని, వారి ఇళ్లలో పనిచేసే పనిమనుషులు, సిబ్బంది వివరాలను సేకరించాలని పేర్కొంది. కొద్ది దశాబ్దాలుగా ఉమ్మడి కుటుంబాల సం ఖ్య తగ్గటం, పిల్లలు ఉద్యోగ రీత్యా దూరంగా ఉండటం, సంతానం లేకపోవటం తదితర అంశాల వల్ల ఒంటరిగా నివసించే వృద్ధుల సంఖ్య పెరుగుతున్నందున సామాజిక పరిస్థితులకు అనుగుణంగా పోలీసులు వ్యవహరించాలని సూచించింది. ‘వయో వృద్ధుల వివరాల రికార్డులను పోలీస్ ఉన్నతాధికారులు తరచుగా సమీక్షిస్తుండాలి. వారి నివాస ప్రాంతాల్లో గస్తీ పెంచాలి. సీనియర్ సిటిజన్ల భద్రత పర్యవేక్షణకు పోలీస్‌శాఖ ప్రత్యేక విభాగాన్ని నెలకొల్పాలి. నిరంతరం పనిచేసేలా టోల్‌ఫ్రీ హెల్ప్‌లైన్ ఏర్పాటు చేయాలి’ అని మార్గదర్శకాల్లో పేర్కొంది.  
 

>
మరిన్ని వార్తలు