పాకిస్తాన్‌లోని గీత మా కూతురే!

10 Aug, 2015 02:14 IST|Sakshi
దినపత్రికల్లో వచ్చిన గీత, చిన్ననాటి రాణి ఫోటోలను చూపిస్తున్న కృష్ణయ్య, గోపమ్మ

* ఖమ్మం జిల్లాకు చెందిన కృష్ణయ్య, గోపమ్మ దంపతులు
* 2006లో మా చిన్న కూతురు గుంటూరులో తప్పిపోయింది
* అప్పుడు ఆమె వయసు పదేళ్లు
* గీత మమ్మల్ని చూస్తే గుర్తుపడుతుంది
* ప్రభుత్వం ఆమె వద్దకు చేర్చేందుకు సహకరించాలి

 
జూలూరుపాడు: పాకిస్తాన్‌లో స్వచ్ఛంద సంస్థ సంరక్షణలో ఉంటున్న గీత తమ కూతురేనని ఖమ్మం జిల్లా జూలూరుపాడు మండలం పడమట నర్సాపురం గ్రామానికి చెందిన జజ్జర కృష్ణయ్య, గోపమ్మ చెబుతున్నారు. గీత తమను చూస్తే గుర్తుపడుతుందని వారంటున్నారు. ఇటీవల టీవీలు, పత్రికలు, సోషల్ మీడియాలలో గీత అంశం విస్తృతంగా ప్రచారమవుతుండటంతో వాటిని ఈ దంపతులు చూశారు. 2006లో తప్పిపోయిన తమ కూతురు రాణియే ఆ బాలిక అని వారు ఆదివారం విలేకరులకు తెలిపారు. గత 13 ఏళ్లుగా పాక్‌లోని ఈది స్వచ్ఛంద సంస్థ సంరక్షణలో గీత ఉంటుందన్న సంగతి తెలిసిందే.
 
 పదేళ్ల వయసులో ఆమెను పంజాబ్ రేంజర్స్ తీసుకువచ్చి తమకు అప్పగించారని ఆ స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు చెబుతున్నారు. ‘‘2006 జనవరి 27న ఏసు సువార్త సభలకు గుంటూరు జిల్లాకు నలుగురు కూతుళ్లను తీసుకొని వెళ్లాను. మరుసటి రోజు చిన్నకూతురు రాణి తప్పిపోయింది. అప్పటికి రాణికి పదేళ్లు. ఆనాటి నుంచి ఇప్పటిదాకా ఎక్కడ వెతికినా రాణి ఆచూకీ దొరకలేదు. మాకు నలుగురు ఆడపిల్లలు. పెద్ద అమ్మాయి రాజమ్మకు మతిస్థిమితం లేదు. రెండో కూతురు జ్యోతికి వివాహం అయింది. మూడో కూతురు పద్మ బీఎస్సీ చదువుతోంది. చిన్న కూతురు రాణి పుట్టుకతోనే మూగ. ఏమీ చదువుకోలేదు’’ అని గోపమ్మ తెలిపారు. రాణి నుదుటిపై పుట్టమచ్చ ఉందని, చేతులకు పులిపిర్లు ఉన్నాయని, మెల్ల కన్ను ఉందని వివరించారు.
 
 ఇటీవల టీవీలు, పేపర్లల్లో చూసిన గీతకు రాణి పోలికలే ఉన్నాయని చెప్పారు. గీత తమ కూతురే అని నమ్ముతున్నట్లు పేర్కొన్నారు. ఈ సందర్భగా దంపతులు రాణి ఎనిమిదేళ్ల నాటి ఫొటోను చూపించారు. తమను చూస్తే గీత గుర్తుపడుతుందని, ప్రభుత్వం ఆమె వద్దకు చేర్చే ప్రయత్నం చేయాలని కోరారు. అవసరమైతే డీఎన్‌ఏ పరీక్షలకు కూడా సిద్ధమన్నారు. ఈ దంపతులకు రెండున్నర ఎకరాల భూమి ఉంది. వ్యవసాయ కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు.
 

మరిన్ని వార్తలు