నిరసన జ్వాల

10 Aug, 2015 02:25 IST|Sakshi
నిరసన జ్వాల

కోటి ఆత్మాహుతిపై జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు
నేడు తిరుపతి బంద్‌కు కాంగ్రెస్ పిలుపు

 
 తిరుపతి కార్పొరేషన్ : ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా నినాదంతో ఒంటికి నిప్పంటిం చుకుని తీవ్రంగా గాయపడిన మునికామ కోటిమరణవార్త తెలియగానే ఆదివారం జిల్లాలో నిరసనలు వెల్లువెత్తాయి. తిరుపతిలో కోటి ఒంటికి నిప్పు అంటించుకున్న ప్రదేశంలో నల్ల బ్యాడ్జీలు తగిలించుకుని పార్టీలకతీతంగా ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మౌనదీక్షకు దిగారు. ఆయన మృతికి నివాళులర్పించారు. వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో పలువురు నాయకులు జిల్లా వ్యాప్తంగా మౌనదీక్షలు, కొవ్వొత్తులతో నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్యర్వంలో ఆదివారం సాయంత్రం నాలుగు కాళ్ల మండపం నుంచి కోటి నిప్పంటించుకున్న ప్రదేశం వ రకు కొవ్వొత్తులతో నిరసన ర్యాలీ నిర్వహించారు. సోమవారం సాయంత్రంలోపు కోటి అంత్యక్రియలు నిర్వహించేలా ఏర్పాటు చేస్తున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు.
 
నేడు తిరుపతి...రేపు రాష్ట్ర బంద్‌కు పిలుపు..
సోమవారం తిరుపతి బంద్‌కు పిలుపునిచ్చినట్లు కాంగ్రెస్ పార్టీ చిత్తూరు జిల్లా కమిటీ అధ్యక్షుడు వేణుగోపాల్‌రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా బంద్ నిర్వహించనున్నట్లు ఆ పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.
 
సన్నిహితులు, స్నేహితుల నివాళి

 ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా నినాదంతో ఆత్మాహుతికి పాల్పడిన బీఎంకే కోటి సన్నిహితులు, స్నేహితులు అతని జ్ఞాపకాలను తలచుకుని కన్నీటి పర్యంతమవుతున్నారు. తిరుపతి నగరంలో నిన్నటి వరకు తమను ఆప్యాయంగా పలకరిస్తూ, ఎవరికి ఏ ఆపద వచ్చినా నేనున్నా అంటూ పలకరించే స్నేహితుడు కోటి మృతి చెందాడని తెలిసి జీర్ణించుకోలేక        పోతున్నారు. తిరుపతి మాజీ ఎమ్మెల్యే మబ్బురామిరెడ్డి కుమారుడు మబ్బు చెంగారెడ్డి శిష్యుడిగా, మబ్బు యువసేన నాయకుడిగా గుర్తింపు పొందిన బెంగళూరు మునికామ కోటి అలి యాస్ బీఎంకే కోటి(41) తక్కువ సమయంలోనే ఉద్యమ నా యకుడిగా ఎదిగారు. మబ్బు చెంగారెడ్డితో కలిసి సమైక్యాంధ్ర ఉద్యమాన్ని ముందుకు నడిపించారు. ఆరు నెలల పాటు దశల వారీగా ఆందోళనలు చేస్తూ కేంద్ర ప్రభుత్వానికి తెలుగు జాతి సత్తాను చాటి చెప్పారని ఆయన సన్నిహితులు తెలిపారు.

 అది ప్రభుత్వ హత్యే..
 కోటి మృతికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని పలువురు ప్రజా సంఘాలు ముక్తకంఠంతో ఆరోపిస్తున్నాయి. మధ్యాహ్నం 4.15 గంటలకు ఆత్యహత్యాయత్నానికి పాల్పడి తీవ్ర గాయాలపాలైన కోటిని రాత్రి 7.25 గంటలకు వేలూరు సీఎంసీ ఆస్పత్రికి తరలించడం ఎంతవరకు సమంజసమని ఆ సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అప్పటికే సమ యం మించిపోవడం, వేలూరు వెళ్లినా వారు కాదనడంతో అక్కడి నుంచి చె న్నై కీళ్లపాక మెడికల్ కళాశాల (కేఎంసీ)కు తీసుకెళ్లినా ప్రయోజనం లేకపోయిందని, ఇది ముమ్మాటికీ ప్రభుత్వం నిర్లక్ష్యంతో జరిగిన హత్యగా భావిస్తున్నామని మం డిపడుతున్నారు. ఈ పాపం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలదేనని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆత్మహత్యాయత్నానికి పాల్పడి ప్రాణపాయ స్థితిలో రుయా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అతడిని పరామర్శించకుండా కాంగ్రెస్ నాయకులు బహిరంగ సభను రెండు గంటల పాటు కొనసాగించారు. సభలో ప్రసంగాలు పూర్తయిన అనంతరం ఆస్పత్రికి వెళ్లి వారు పరామర్శించడంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి.
 

మరిన్ని వార్తలు