గ్లోబల్ మార్కెట్లలో రైల్వే ‘రూపీ’ బాండ్‌లు

26 Feb, 2016 00:54 IST|Sakshi

 నిధుల సమీకరణ కోసం కొత్త రూట్..

న్యూఢిల్లీ: భారతీయ రైల్వేలు ఇక గ్లోబల్ మార్కెట్ల బాట పట్టనున్నాయి. రైల్వే మౌలిక సదుపాయాల కోసం వచ్చే ఆర్థిక సంవత్సరం(2016-17)లో రూ.1.21 లక్షల కోట్ల భారీ వ్యయ ప్రణాళికలను ప్రకటించిన నేపథ్యంలో రైల్వే శాఖ నిధుల సమీకరణ కోసం కొత్త మార్గాలను అన్వేషిస్తోంది. ఇందులో భాగంగానే విదేశీ మార్కెట్లలో రూపీ బాండ్‌లను జారీ చేయనున్నట్లు రైల్వే శాఖ మంత్రి సురేశ్ ప్రభు బడ్జెట్‌లో ప్రకటించారు. దీంతోపాటు రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో జాయింట్ వెంచర్ల ఏర్పాటు, కొత్తగా ప్రభుత్వ-ైప్రైవేటు భాగస్వామ్యాలు(పీపీపీ), వివిధ సంస్థలతో జట్టుకట్టడం ద్వారా ప్రాజెక్టులకు అవసరమైన నిధులను సమకూర్చుకోనున్నట్లు ఆయన వెల్లడించారు. గత ఆర్థిక సంవత్సరాలతో పోలిస్తే ఈ ఏడాది రైల్వేల సగటు పెట్టుబడి వ్యయాలు దాదాపు రెట్టింపు కానున్నాయని.. గతంలో ఎన్నడూ ఇంతగా పెంచలేదని చెప్పారు.

2009-14 వరకూ రైల్వేల సగటు వార్షిక పెట్టుబడి వ్యయాలు రూ.48,100 మాత్రమేనని ప్రభు వివరించారు. ‘దేశంలో మౌలిక వృద్ధికి రైల్వేలు ఇంజిన్‌గా పనిచేయనున్నాయి. తొలిసారిగా భారతీయ రైల్వేలు పెట్టుబడి నిధుల కోసం అంతర్జాతీయ మార్కెట్లలోకి అడుగుపెట్టనున్నాయి. వెచ్చించే ప్రతి రూపాయికీ ఆర్థిక వ్యవస్థలో ఐదు రూపాయల మేర ఉత్పాదకతను పెంచే సామర్థ్యం రైల్వేలకు ఉంది. దేశ ఆర్థిక వృద్ధి రేటుపై రైల్వేల పెట్టుబడి ప్రణాళికలు అత్యంత సానుకూల ప్రభావాన్ని చూపుతాయి’ అని ఆని ప్రభు వ్యాఖ్యానించారు.

మరిన్ని వార్తలు