బేర్ 'విశ్వ' రూపం !

28 Jan, 2014 01:17 IST|Sakshi
బేర్ 'విశ్వ' రూపం !

 సెన్సెక్స్ 426 పాయింట్లు డౌన్
 5 నెలల్లో అతిపెద్ద పతనం
 పడగొట్టిన విదేశీ కారణాలు
 బ్యాంకింగ్, రియల్టీ విలవిల
 కుప్పకూలిన చిన్న షేర్లు
 రూపాయి క్షీణత ఎఫెక్ట్ కూడా
 
 కొద్ది రోజులుగా బుల్ ధోరణిలో దూసుకెళ్తున్న స్టాక్ మార్కెట్లకు సోమవారం షాక్ తగిలింది. చలికాలంలో సైతం ఇండియా మొదలు ఆసియా, యూరప్, అమెరికా మార్కెట్లకు అమ్మకాల సెగ తగిలింది. దీనికి గత వారం చివర్లోనే బీజం పడగా... సోమవారం నష్టాలు ఉధృతమయ్యాయి. వెరసి అమెరికా, ఆసియా, యూరప్ ఇండెక్స్‌లు 1-3% మధ్య నష్టపో గా, దేశీయ మార్కెట్లు 2% స్థాయిలో పతనమయ్యాయి.
 
 మూడు వారాల కనిష్టం
 చిన్న, పెద్ద తేడాలేకుండా అన్ని రంగాల షేర్లలోనూ ఇన్వెస్టర్లు అమ్మకాలకు దిగడంతో మార్కెట్లు ఒక్కసారిగా డీలాపడ్డాయి. ఐదు నెలల్లో ఎన్నడూ లేని విధంగా సెన్సెక్స్ 426 పాయింట్లు పతనమైంది. 20,707 వద్ద ముగిసింది. ఇది 3 వారాల కనిష్టంకాగా, ఇంతక్రితం 2013 సెప్టెంబర్ 3న మాత్రమే సెన్సెక్స్ ఈ స్థాయిలో 651 పాయింట్లు దిగజారింది. కాగా, నిఫ్టీ కూడా 131 పాయింట్లు పడిపోయి 6,136 వద్ద నిలిచింది. ఇది 2 నెలల కనిష్టంకావడం గమనార్హం. మార్కెట్ల పతనాన్ని ప్రధానంగా అంతర్జాతీయ అంశాలు శాసించినప్పటికీ, జనవరి నెల ఫ్యూచర్స్, ఆప్షన్స్ కాంట్రాక్ట్‌ల గడువు గురువారం(30న) ముగియనుండటంతో ట్రేడర్లు అమ్మకాలకు పరుగు తీశారని విశ్లేషకులు చెబుతున్నారు. ఇది చాలదన్నట్లు డాలరుతో మారకంలో రూపాయి10 వారాల కనిష్టానికి చేరడం కూడా సెంటిమెంట్‌ను దెబ్బతీసింది.
 
 ప్రారంభమే నష్టాలతో
 బలహీనపడ్డ సెంటిమెంట్ నేపథ్యంలో సెన్సెక్స్ ఉదయం 235 పాయింట్ల నష్టంతో ప్రారంభమైంది. ఆపై ఏ దశలోనూ కోలుకోకపోగా కనిష్టంగా 20,688ను తాకింది. ఇది దాదాపు 450 పాయింట్ల నష్టం!  దీంతో పాటు వర్థమాన మార్కెట్ల కరెన్సీలు, స్టాక్ మార్కెట్లు కూడా క్షీణించాయి. యూరప్‌లోని యూకే, ఫ్రాన్స్, జర్మనీ 0.5-1% మధ్య నష్టపోగా, ఆసియాలో తైవాన్, చైనా, సింగపూర్, జపాన్, ఇండోనేసియా, దక్షిణ కొరియా 1-2.5% మధ్య పడ్డాయి. శుక్రవారం అమెరికా మార్కెట్లు 2%పైగా నష్టపోయిన సంగతి తెలిసిందే.
 
 వడ్డీ భయాలు...
 సోమవారం ట్రేడింగ్‌లో ప్రధానంగా వడ్డీ ప్రభావిత రంగాలు బిత్తరపోయాయి. వడ్డీ రేట్ల నిర్ణయాలలో రిటైల్ ద్రవ్యోల్బణానికి ప్రాధాన్యం ఇవ్వమంటూ ఆర్‌బీఐ కమిటీ సూచించడం ప్రభావం చూపింది. బీఎస్‌ఈ రియల్టీ ఇండెక్స్ ఏకంగా 7% కుప్పకూలగా, బ్యాంకెక్స్ 4% పతనమైంది. రియల్టీలో హెచ్‌డీఐఎల్, ఇండియాబుల్స్, డీఎల్‌ఎఫ్, యూనిటెక్, అనంత్‌రాజ్, ప్రెస్టీజ్ ఎస్టేట్స్, డీబీ, ఒబెరాయ్ 5-13% మధ్య నీరసించాయి. ఇక బ్యాంకింగ్ దిగ్గజాలు హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ, యాక్సిస్, పీఎన్‌బీ, కెనరా, బీవోబీ, ఇండస్‌ఇండ్, బీవోఐ, యస్ బ్యాంక్ 4-8% మధ్య నేలచూపులు చూశాయి.
 
 ఎఫ్‌ఐఐలు వెనక్కి...
     శుక్రవారం రూ. 231 కోట్ల విలువైన షేర్లను అమ్మిన విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు(ఎఫ్‌ఐఐ)లు తాజాగా రూ. 1,334 కోట్ల విలువైన పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. అయితే దేశీయ ఫండ్స్ రూ. 151 కోట్లను ఇన్వెస్ట్ చేశాయి.
 
     చిన్న షేర్లలో జేపీ, డిష్‌మ్యాన్, జేపీ పవర్, జీఎంఆర్ ఇన్‌ఫ్రా, ఐఆర్‌బీ ఇన్‌ఫ్రా, దివాన్ హౌసింగ్, ఏబీజీ షిప్‌యార్డ్, కోరమాండల్ ఇంటర్నేషనల్, యూకో బ్యాంక్ వంటివి 14-8% మధ్య పతనమయ్యాయి.
 
 పతనానికి ప్రధాన కారణాలివీ..
     గత వారం చివర్లో వెల్లడైన గణాంకాలు మళ్లీ చైనా ఆర్థిక వ్యవస్థ మందగిస్తున్న సంకేతాలిచ్చాయి.
     మంగళవారం నుంచీ పరపతి సమీక్షను చేపడుతున్న అమెరికా ఫెడ్... సహాయక ప్యాకేజీలలో కోతను పెంచవచ్చుననే అంచనాలున్నాయి. అదే జరిగితే షేర్లు, కరెన్సీ తదితర రిస్క్ అధికంగా గల ఆస్తుల నుంచి పెట్టుబడులు తరలిపోతాయనే భయాలున్నాయి.
 
     దేశీయంగా ఆర్‌బీఐ పాలసీ సమీక్ష కూడా మంగళవారమే ఉంది. ద్రవ్యోల్బణాన్ని వినాశకర వ్యాధిగా ఆర్‌బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ పోల్చటంతో... వడ్డీ రేట్లు తగ్గిస్తారనే ఆశలు ఆవిరయ్యాయి.
     అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ రికవరీపై తాజాగా సందేహాలు నెలకొనడం సెంటిమెంట్‌ను దెబ్బతీసింది.
 
 మామూలు క్షీణత కాదు..
     బీఎస్‌ఈలో అన్ని రంగాల సూచీలూ నేలచూపులు చూశాయి. ప్రధానంగా మెటల్స్, క్యాపిటల్ గూడ్స్, పవర్, ఆటో రంగాలు సైతం 3% స్థాయిలో పడ్డాయి.
 
     సెన్సెక్స్‌కు ప్రాతినిధ్యంవహించే 30 షేర్లలో ఐటీసీ, సిప్లా మాత్రమే నిలదొక్కుకోగా, ప్రోత్సాహకర ఫలితాలతో హెచ్‌యూఎల్ దాదాపు 2% లాభపడింది.
 
     బ్లూచిప్స్‌లో టాటా స్టీల్, టాటా మోటార్స్ 6% చొప్పున దిగజారగా, టాటా పవర్ 4% క్షీణించింది. ఈ బాటలో మారుతీ, సెసా స్టెరిలైట్, ఆర్‌ఐఎల్, ఎల్‌అండ్‌టీ, హిందాల్కో, ఎంఅండ్‌ఎం, భారతీ ఎయిర్‌టెల్‌లు 4-2 శాతం మధ్య నష్టపోయాయి.
 
     ట్రే డైన షేర్లలో 1,952 తిరోగమిస్తే... కేవలం 643 బలపడ్డాయంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. వీటిలో 52 షేర్లు ఏడాది కనిష్టాలను తాకాయి.
     మిడ్, స్మాల్ క్యాప్ కంపెనీలకు చెందిన ఇండెక్స్‌లు దాదాపు 3 శాతం మేర తిరోగమించాయి.
 

మరిన్ని వార్తలు