ప్రైవేటు యూనివర్సిటీలకు పచ్చజెండా!

5 Mar, 2016 01:45 IST|Sakshi

రేపు రాష్ట్ర కేబినెట్ భేటీ
* బడ్జెట్ సమావేశాలే ప్రధాన ఎజెండా
* కొత్త మైనింగ్ విధానం సహా 25 అంశాలపై చర్చ

సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రైవేటు విశ్వవిద్యాలయాల ప్రభుత్వం పచ్చజెండా ఊపుతోంది. వీసీల నియామకం, ప్రైవేటు వర్సిటీలకు అనుమతి, ఒక మహిళా విశ్వవిద్యాలయం ఏర్పాటుకు వీలుగా ఏపీ ఉన్నత విద్యా చట్టం లో మార్పు లు చేస్తూ తెలంగాణకు అన్వయిం చుకోవాలని నిర్ణయించింది. దీంతోపాటు సాగునీటి ప్రాజెక్టుల రీడిజైనింగ్‌కు అనుగుణంగా అంచనాల్లో, పరిపాలనా అనుమతుల్లో మా ర్పులను వేగవంతం చేయనుంది.

ఈ మేరకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన ఆదివారం జరిగే మంత్రివర్గ సమావేశంలో నిర్ణయాలు తీసుకోనున్నారు. ఈనెల 10 నుంచి బడ్జెట్ సమావేశాలు ప్రారంభించాలని, 14న అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టాలని ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యం లో ఆదివారం కేబినెట్ భేటీ కానుంది. అసెంబ్లీ సమావేశాలను ఎప్పుడు ప్రారంభించాలి, ఎన్ని రోజులు నిర్వహించాలనే తేదీలపై తుది నిర్ణయం తీసుకోనున్నారు. తొలిరోజున ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించి గవర్నర్ ప్రసంగిస్తారు. ఈ ప్రసంగ పాఠానికి కేబినెట్ ఆమోదం తెలపనుంది. గవర్నర్ ప్రసంగంతో పాటు బడ్జెట్ ప్రవేశపెట్టే ముహూర్తాన్ని ఖరారు చేయనున్నారు.
 
నీటిపారుదలపై ప్రత్యేక దృష్టి
ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు రీడిజైనింగ్‌కు సంబంధించి కేబినెట్‌లో పలు సవరణలతో ఆమోదం పొందాల్సి ఉంది. మేడిగడ్డ, అన్నా రం, సుందిళ్ల ప్రాజెక్టులకు రూ.5,813 కోట్ల అంచనాతో ప్రభుత్వం పరిపాలనా అనుమతులిచ్చింది. ఈ నిర్ణయానికి ఆమోదం పొందాల్సి ఉంది. దేవాదుల, కంతనపల్లి ప్రాజెక్టుల రీడిజైనింగ్‌పైనా, మిడ్‌మానేరు నిర్వాసితులకు మరింత లబ్ధి చేకూరేలా పరిహారం ప్యాకేజీ చెల్లింపుల్లో మార్పులు చేర్పులపై కేబినెట్ భేటీలో చర్చించనున్నారు. నీటిపారుదల విభాగంలో సూపర్ న్యూమరీ పోస్టుల్లో పనిచేస్తున్న ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్(ఈఈ)లను మరో ఏడాది పాటు కొనసాగించాలనే ప్రతిపాదనను ఎజెండాలో పొందుపరిచారు.
 
కొత్త మైనింగ్ విధానం

కొత్త మైనింగ్ విధానానికి కేబినెట్‌లో ఆమోద ముద్ర వేస్తారు. హమాలీ కుటుంబాల్లో పట్టభద్రులుగా ఉన్న మహిళలకు ప్రోత్సాహకం ఇచ్చే అంశం ఎజెండాలో ఉంది. ఆర్టీసీకి రూ.500 కోట్ల గ్యారంటీ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మిషన్ భగీరథకు నాబార్డు నుంచి రూ.1,900 కోట్ల రుణం, హడ్కో నుంచి హైదరాబాద్ మెట్రో వాటర్‌సప్లై బోర్డుకు తీసుకునే రుణానికి ప్రభుత్వం తరఫున గ్యారంటీ ఇవ్వాల్సి ఉంది. ఈ అంశాలను చర్చిస్తారు.
 
ఆర్డినెన్స్‌ల స్థానంలో బిల్లులు
బీఆర్‌ఎస్, మున్సిపల్ ఎన్నికల చట్టానికి సవరణలు చేస్తూ ప్రభుత్వం ఇటీవల ఆర్డినెన్స్‌లు తెచ్చింది. వాటిని చట్టంగా మార్చేందుకు అసెంబ్లీలో బిల్లులు పెట్టాలని నిర్ణయించింది. తెలంగాణ బ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటు, మహబూబ్‌నగర్ జిల్లాలో ఫిషరీస్ ఎడ్యుకేషన్ అకాడమీ స్థాపన, బేగంపేట క్యాంపు ఆఫీసు సమీపంలో ఐఏఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్‌కు మూడెకరాల స్థలం కేటాయింపు, మెదక్ జిల్లాలోని ముచ్చర్ల సమీపంలో 50 ఎకరాలను టీఎస్‌ఐఐసీకి కేటాయింపు అంశాలపైనా చర్చించి నిర్ణయం తీసుకుంటారు. ఇటీవల మైనారిటీ విభాగంలో 20 రెగ్యులర్ పోస్టులు, 19 ఔట్ సోర్సింగ్ పోస్టులు, వైద్య ఆరోగ్య విభాగంలో 23 కొత్త పోస్టులను మంజూరు చేస్తూ ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. వీటికి కేబినెట్‌లో ఆమోదం పొందాల్సి ఉంటుంది.

Read latest Top-news News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు