హన్మకొండ జిల్లా రద్దు!

5 Sep, 2016 01:46 IST|Sakshi
హన్మకొండ జిల్లా రద్దు!

- ప్రజాభిప్రాయంపై సీఎంకు నివేదికలు
- కొత్తగా వరంగల్ రూరల్ జిల్లా
- కాకతీయ లేదా భద్రకాళి పేరు పెట్టే యోచన
- అధికారులతో కేసీఆర్ సుదీర్ఘ సమీక్ష
- జిల్లాలపై వెల్లువెత్తుతున్న అభ్యంతరాలు
- ఇప్పటికే 30 వేలు దాటిన వైనం


సాక్షి,హైదరాబాద్: కొత్త జిల్లాల ముసాయిదాపై వెల్లువెత్తుతున్న ప్రజాభిప్రాయాలను రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటోంది. వరంగల్ జిల్లాలో కొత్తగా ప్రతిపాదించిన వరంగల్, హన్మకొండ, భూపాలపల్లి, మహబూబాబాద్ జిల్లాలపై పునరాలోచనలో పడింది. వరంగల్ సిటీ కేంద్రంగా ఉన్న వరంగల్, హన్మకొండలను రెండు జిల్లాలుగా విభజించడంపై అక్కడి ప్రజల నుంచి వ్యతిరేకత పెల్లుబికింది. వరంగల్, హన్మకొండ, ఖాజీపేట నగరాలు మూడూ ఒకే జిల్లాలో ఉండాలనే అభిప్రాయాలకు ఎక్కువ మంది మొగ్గుచూపారు. ఇంటెలిజెన్స్‌తో పాటు వివిధ వర్గాల నుంచి ఈ సమాచారాన్ని సేకరించిన ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆదివారం క్యాంపు కార్యాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ, డీజీపీ అనురాగ్ శర్మతో పాటు ముఖ్య అధికారులతో సమీక్ష నిర్వహించారు.

ఈ సమావేశంలో ప్రధానంగా వరంగల్ జిల్లా అంశమే చర్చకు వచ్చినట్లు విశ్వసనీయంగా తెలిసింది. హన్మకొండకు బదులు వరంగల్‌ను జిల్లాగా కొనసాగించాలనే ప్రతిపాదనపై ముఖ్యమంత్రి సమక్షంలో సుదీర్ఘంగా చర్చ జరిగినట్లు సమాచారం. భూపాలపల్లి, మహబూబాబాద్ జిల్లాలు మినహాయిస్తే వరంగల్‌లో దాదాపు 30 మండలాలు, 23 లక్షలకుపైగా జనాభా ఉంటాయి. వైశాల్యమూ పెద్దగా ఉంటుందని, దాంతో చిన్న జిల్లాల దృ క్పథమే దెబ్బతింటుందని సమీక్షలో ప్రస్తావనకు వచ్చింది. రాష్ట్రంలో 27 జిల్లాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ప్రతిపాదించడం తెలిసిందే. సగటున ఒక జిల్లాలో 18 మండలాలు, 13.33 లక్షల జనాభా ఉంటాయి. కానీ వరంగల్ 30 మండలాలు, 23 లక్షల జనాభాతో రాష్ట్రంలోనే పెద్ద జిల్లాగా ఏర్పడుతుంది. తద్వారా పాలనా సౌలభ్యానికి చిన్న జిల్లాలు ఏర్పాటు చేస్తున్న స్ఫూర్తి దెబ్బ తింటుందనే చర్చ జరిగినట్లు సమాచారం.

తెరపైకి ‘వరంగల్ రూరల్’
వరంగల్ నగరాన్ని విడదీయకుండా ఉండేందుకు వరంగల్ రూరల్ పేరుతో కొత్త జిల్లా ఏర్పాటు దిశగా ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. అందుకు అనుగుణంగా మార్పుచేర్పుల కసరత్తు ప్రారంభించింది. ఇందులో భాగంగా ప్రతిపాదిత హన్మకొండ జిల్లాను రద్దు చేసి, అందులో ప్రతిపాదించిన మండలాలన్నిటినీ వరంగల్ జిల్లాలో కలుపుతారు. దాంతో గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధితో పాటు ప్రస్తుతం హన్మకొండ జిల్లాగా ప్రతిపాదించిన మండలాలన్నీ కొత్త వరంగల్ జిల్లాలోనే ఉంటాయి. వరంగల్ తూర్పు అసెంబ్లీ నియోజకవర్గం మినహా వరంగల్‌లో ప్రతిపాదించిన ఇతర మండలాలతో కొత్తగా వరంగల్ రూరల్ జిల్లా ఏర్పడుతుంది. ఇలా రెండు జిల్లాలు చేస్తే వరంగల్ సిటీ మొత్తం ఒకే జిల్లాలో ఉంటుందని, చిన్న జిల్లాలు ఏర్పాటు చేస్తున్న ప్రయోజనమూ నెరవేరుతుందని సీఎం పేర్కొన్నట్టు తెలిసింది. అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించినట్టు సమాచారం. కొత్తగా ఏర్పడే వరంగల్ రూరల్ జిల్లాకు కాకతీయ జిల్లా, లేదా భద్రకాళి జిల్లా అని పేరు పెట్టాలని ప్రభుత్వం భావిస్తోంది.

30 వేలు దాటిన అభ్యంతరాలు
జిల్లాల పునర్వ్యవస్థీకరణ ముసాయిదాపై అభ్యంతరాలు వెల్లువెత్తుతున్నాయి. గడిచిన పన్నెండు రోజుల వ్యవధిలో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా రూపొందించిన  వెబ్‌సైట్ ద్వారా 29,411 మంది ఆన్‌లైన్‌లో తమ విజ్ఞప్తులను నమోదు చేశారు. వీటికి తోడు జిల్లా కలెక్టరేట్లలో, సీసీఎల్‌ఏలో మరో రెండు వేలకు పైగా అర్జీలు అందినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ఆన్‌లైన్ అర్జీల ప్రకారం అత్యధికంగా వనపర్తి జిల్లా ఏర్పాటుపై 7,738, యాదాద్రి జిల్లాపై 4,386 విజ్ఞప్తులు  అందాయి. కొత్త డివిజన్లకు సంబంధించి అత్యధికంగా జగిత్యాల జిల్లాపై 5,168 ఫిర్యాదులు నమోదయ్యాయి. కోరుట్లను రెవిన్యూ డివిజన్ కేంద్రం చేయాలని అత్యధికంగా విజ్ఞప్తులు వెల్లువెత్తాయి.

కొత్త ప్రతిపాదనల స్వరూపం
వరంగల్ జిల్లా (21 మండలాలు): వరంగల్ కార్పొరేషన్, హన్మకొండ, ఖిలా వరంగల్, హసన్‌పర్తి, ఖాజీపేట, ధర్మసాగర్, చిల్పూర్, వేలేరు, స్టేషన్ ఘన్‌పూర్, రాయపర్తి, జఫర్‌గఢ్, నర్మెట్ట, రఘునాథపల్లి, పాలకుర్తి, కొడకండ్ల, ఇల్లంతకుంట, హుజూరాబాద్, ఎల్కతుర్తి, భీమదేవరపల్లి, కమలాపూర్, జమ్మికుంట

వరంగల్ రూరల్ జిల్లా (14 మండలాలు) : ఐనవోలు, వర్ధన్నపేట, ఆత్మకూరు, గీసుకొండ, సంగెం, పర్వతగిరి, నెక్కొండ, చెన్నారావుపేట, నర్సంపేట, ఖానాపూర్, దుగ్గొండి, నల్లబెల్లి, శాయంపేట, పరకాల

>
మరిన్ని వార్తలు