‘హెల్త్’ ప్రిన్సిపల్ సెక్రటరీగా పూనం

30 Oct, 2015 02:16 IST|Sakshi

* ఎక్సైజ్ కమిషనర్‌గా మీనా
* ఉత్తర్వులు జారీ చేసిన సీఎస్
సాక్షి, హైదరాబాద్: వైద్యారోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యంపై ప్రభుత్వం బదిలీ వేటు వేసింది. యువజన, క్రీడలు, పర్యాటక, సాంస్కృతిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఆయనను నియమించింది. ఆయన స్థానంలో పూనం మాలకొండయ్యను వైద్యారోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా నియమించారు. ప్రభుత్వం పలువురు ఉన్నతాధికారుల శాఖలను మార్చింది. ఎక్సైజ్ శాఖ కమిషనర్ నరేశ్‌ను ఇటీవల ప్రభుత్వం బదిలీ చేసిన విషయం విదితమే.

సాధారణ పరిపాలన విభాగం(రాజకీయ) కార్యదర్శిగా పనిచేస్తోన్న ముకేశ్ కుమార్ మీనాను ఎక్సైజ్, ప్రొహిబిషన్ శాఖ కమిషనర్‌గా, ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ ఎండీగా నియమించారు. మార్కెటింగ్ శాఖ కమిషనర్ బి.కిశోర్‌ను సాధారణ పరిపాలన విభాగం (సర్వీసెస్) కార్యదర్శిగా బదిలీ చేశారు. సహకార శాఖ స్పెషల్ కమిషనర్ శేషగిరిబాబుకు మార్కెటింగ్ శాఖ అదనపు బాధ్యతలు అప్పగించారు.

సాధారణ పరిపాలన విభాగం (ప్రొటోకాల్) సంయుక్త కార్యదర్శిగా ఉన్న  సత్యనారాయణను ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ స్పెషల్ కమిషనర్‌గా, నేషనల్ హెల్త్ మిషన్ (ఎన్‌హెచ్‌ఎం) ఈడీ, ఎయిడ్స్ నియంత్రణ మండలి పీడీగా నియమించారు. ఢిల్లీలోని ఏపీ భవన్‌లో ఓఎస్డీగా ఉన్న లెప్టినెంట్ కల్నల్ ఎం.అశోక్‌బాబును ప్రొటోకాల్ విభాగం డెరైక్టర్‌గా నియమిస్తూ గురువారం సీఎస్  కృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు.

ఆరోగ్యశాఖకు స్పెషల్ చీఫ్ సెక్రటరీగా ఉన్న ఎల్వీ సుబ్రహ్మణ్యంను అప్రధాన శాఖ టూరిజం, యూత్ అడ్వాన్స్‌మెంట్‌శాఖకు బదిలీ చేయడం చర్చనీయాంశమైంది.

మరిన్ని వార్తలు