ఆయన శాఖ మార్చేస్తా: సీఎం

22 Mar, 2017 20:22 IST|Sakshi
ఆయన శాఖ మార్చేస్తా: సీఎం

రెండు పడవల మీద కాళ్లేస్తానంటున్న మాజీ క్రికెటర్ నవ్‌జ్యోత్ సింగ్ సిద్ధూ వైఖరితో పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ తంటాలు పడుతున్నారు. ఒకవైపు మంత్రిగా కొనసాగుతూనే, మరోవైపు 'ద కపిల్ శర్మ షో'లో పాల్గొంటానని సిద్ధూ కచ్చితంగా చెప్పడంతో అలాగైతే ఆయన శాఖ మార్చేయాల్సి వస్తుందని కెప్టెన్ అంటున్నారు. దానికి బదులు ఆయనకు వేరే శాఖ ఇస్తామని అన్నారు. ప్రస్తుతం సిద్ధూ వద్ద పర్యాటక, సాంస్కృతిక, మ్యూజియంల శాఖలున్నాయి. వాటిలో సాంస్కృతిక శాఖతో సిద్ధూ పాల్గొనే షోకు సంబంధం ఉంటుంది. దాంతో అప్పుడు ప్రయోజనాల వైరుధ్యానికి సంబంధించిన సమస్య వస్తుంది. అయితే.. కిరణ్ ఖేర్ పార్లమెంటు సభ్యురాలిగా ఉంటూ నటిగా కూడా కొనసాగారని సిద్ధూ వాదిస్తున్నారు. కిరణ్ ఖేర్ మాత్రం తాను మూడు సినిమాలను తిరస్కరించానని, ఎంపీ అయిన తర్వాత నటించలేదని స్పష్టం చేశారు.

పంజాబ్‌లో కాంగ్రెస్ గెలుపులో సిద్ధూ పాత్ర చాలా ఉందని అందరూ అన్నారు. దాంతో ఆయనకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వడం ఖాయమని కూడా వినిపించింది. అలాంటి పరిస్థితుల్లో ఆయనకు సీఎం అమరీందర్ సింగ్ ఏమాత్రం ప్రాధాన్యం లేని శాఖలు ఇచ్చారు. తాను వారానికి నాలుగు రోజులు మాత్రమే, అది కూడా రాత్రిపూట తన విధి నిర్వహణ పూర్తయిన తర్వాత షో చేస్తానంటున్నానని, బాదల్‌ లాగ బస్సు సర్వీసులు నడపమంటారా అని అంటూ పంజాబ్ మాజీ ఉప ముఖ్యమంత్రి సుఖ్‌బీర్ సింగ్ బాదల్ మీద వ్యంగ్యాస్త్రాలు విసిరారు. మరోవైపు.. సిద్ధూ కపిల్ శర్మ షోలో పాల్గొనవచ్చా లేదా అనే విషయమై సీఎం అమరీందర్ సింగ్ న్యాయ సలహా కోరారు.

మరిన్ని వార్తలు