ఎగుమతులు రయ్..

10 Oct, 2013 00:18 IST|Sakshi
ఎగుమతులు రయ్..

న్యూఢిల్లీ: మందగమనంతో కొట్టుమిట్టాడుతున్న ఆర్థిక వ్యవస్థకు కొండంత ఉపశమనం కలిగిస్తూ... వాణిజ్య లోటు భారీగా దిగొచ్చింది. సెప్టెంబర్‌లో ఎగుమతులు వరుసగా మూడో నెలలోనూ పుంజుకోవడం, దిగుమతులు అనూహ్యంగా క్షీణించడంతో వాణిజ్య లోటు 30 నెలల కనిష్టానికి పడిపోయింది. 60 శాతంపైగా దిగొచ్చి కేవలం 6.76 బిలియన్ డాలర్లకు మాత్రమే పరిమితమైంది. ప్రధానంగా బంగారం, వెండి, ముడిచమురు దిగుమతులు తగ్గుముఖం పట్టడం ఇందుకు దోహదం చేసింది. 2011, మార్చిలో వాణిజ్య లోటు 3.8 బిలియన్ డాలర్లుగా నమోదైంది. మళ్లీ ఇంత కనిష్ట స్థాయికి దిగిరావడం ఇదే తొలిసారి కావడం గమనార్హం, కాగా, ఈ ఏడాది ఆగస్టులో వాణిజ్య లోటు 10.9 బిలియన్ డాలర్లు .

 కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ బుధవారం విడుదల చేసిన గణాంకాల ప్రకారం... సెప్టెంబర్‌లో దేశ ఎగుమతుల విలువ 27.68 బిలియన్ డాలర్లకు ఎగబాకింది. క్రితం ఏడాది ఇదే నెలతో పోలిస్తే 11.15 శాతం వృద్ధి చెందాయి. ఇక దిగుమతులు ఏకంగా 18.1 శాతం క్షీణించి 34.4 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి. కాగా, వాణిజ్య లోటు భారీగా తగ్గడం వల్ల కరెంట్ అకౌంట్ లోటు(క్యాడ్)కు కూడా కళ్లెం పడేందుకు దోహదం చేయనుంది. గత కొద్ది నెలలుగా తీవ్ర హెచ్చుతగ్గులతో, మహా పతనాన్ని చవిచూసిన రూపాయి విలువ స్థిరీకరణకు కూడా చేదోడుగా నిలవనుందని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. ఏప్రిల్ నుంచి చూస్తే డాలరుతో రూపాయి మారకం విలువ 15 శాతం పైగానే పడిపోవడం తెలిసిందే.
 
 తొలి ఆరు నెలల్లోనూ ఎగుమతుల్లో వృద్ధి...
 ఈ ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల(ఏప్రిల్-సెప్టెంబర్) కాలంలో కూడా దేశ ఎగుమతులు వృద్ధిబాటలోనే ఉన్నాయి. క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 5.14 శాతం ఎగబాకి.. 152.1 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. దిగుమతులు 1.8 శాతం తగ్గుముఖం పట్టి.. 232.23 బిలియన్ డాలర్లకు చేరాయి. ఇక ఏప్రిల్-సెప్టెంబర్ వ్యవధిలో వాణిజ్య లోటు 13 శాతంమేర క్షీణించి 80.1 బిలియన్ డాలర్లుగా నమోదైంది.
 
 ఇతర ముఖ్యాంశాలివీ...

  •      దేశ ఎగుమతులకు వెన్నుదన్నుగా ఉన్న ఇంజనీరింగ్ ఉత్పత్తులు సానుకూల వృద్ధితో పయనిస్తున్నాయి. సెప్టెంబర్‌లో 15.2% ఎగబాకి... 5.2 బిలియన్ డాలర్లకు చేరాయి.
  •      రత్నాభరణాల ఎగుమతులు సెప్టెంబర్‌లో 8.31 శాతం తగ్గాయి. 3.79 బిలియన్ డాలర్లకు పరిమితయ్యాయి. ఏప్రిల్-సెప్టెంబర్‌లో కూడా 8.7 శాతం తగ్గుముఖంతో 20 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి.
  •      టెక్స్‌టైల్స్, ఫార్మా, వ్యవసాయోత్పత్తుల ఎగుమతులు సెప్టెంబర్‌లో మెరుగైన వృద్ధిని కనబరచడం విశేషం.
  •      ఏప్రిల్-సెప్టెంబర్‌లో ముడిచమురు దిగుమతులు 3.58% పెరిగి 82.87 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి.
  •      చమురుయేతర దిగుమతులు ఇదే వ్యవధిలో 4.55 శాతం తగ్గి.. 149.35 బిలియన్ డాలర్లకు చేరాయి.

 
 ప్రభుత్వ చర్యలు ఫలితాలిస్తున్నాయి: రావు
 బంగారం దిగుమతుల కట్టడితో పాటు నిత్యావసరంకాని వస్తువుల దిగుమతులపై నియంత్రణ చర్యలు వాణిజ్యలోటు తగ్గుదలకు చేదోడుగా నిలుస్తున్నాయని వాణిజ్య శాఖ కార్యదర్శి ఎస్‌ఆర్ రావు వ్యాఖ్యానించారు. గణాంకాల విడుదల సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ చర్యలను ఇలాగే కొనసాగించాల్సిన అవసరం ఉందని, దీంతో రానున్న కాలంలో రూపాయి మారకం విలువ బలోపేంతం అయ్యేందుకు అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. ఈ ఏడాది(2013-14)లో 325 బిలియన్ డాలర్ల ఎగుమతుల లక్ష్యం సాకారమవుతుందనే విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు. మరోపక్క, అమెరికాలో ప్రభుత్వ కార్యకలాపాల మూసివేత(షట్‌డౌన్) ప్రభావం భారత్ ఎగుమతులపై పెద్దగా ప్రభావం చూపకపోవచ్చని రావు అభిప్రాయపడ్డారు.
 
 కార్పొరేట్లు ఖుషీ...: వాణిజ్య లోటు భారీగా దిగిరావడం, మరోపక్క ఎగుమతులు రెండంకెల వృద్ధితో కొనసాగుతుండటంపట్ల పారిశ్రామిక వర్గాలు ఆనందం వ్యక్తం చేశాయి. దీనివల్ల క్యాడ్‌కు కళ్లెం పడటంతో పాటు రూపాయి విలువ కూడా 60 స్థాయిలో స్థిరీకరణకు దోహదం చేయనుందని అభిప్రాయపడ్డాయి. తాజా వాణిజ్య గణాంకాలు ఆర్థిక వ్యవస్థకు శుభసూచకంగా కనబడుతున్నాయని ఫిక్కీ ప్రెసిడెంట్ నైనాలాల్ కిద్వాయ్ వ్యాఖ్యానించారు.ఈ ఏడాది దేశ ఎగుమతులు 350 బిలియన్ డాలర్లను తాకొచ్చని, వాణిజ్యలోటు 150 బిలియన్ డాలర్ల దిగువకు తగ్గుముఖం పట్టొచ్చని భారతీయ ఎగుమతి సంస్థల సమాఖ్య ప్రెసిడెంట్ రఫీక్ అహ్మద్ అభిప్రాయపడ్డారు. దీంతో క్యాడ్‌ను కూడా 70 బిలియన్ డాలర్లకు(3.7శాతం) కట్టడి చేసేందుకు అవకాశం ఉందన్నారు.
 
 బంగారం దిగుమతులకు కళ్లెం...
 క్యాడ్(మూలధన పెట్టుబడులు మినహా దేశంలోకి వచ్చే, బయటికి పోయే విదేశీ మారక నిధుల మధ్య వ్యత్యాసం)ను ఎగదోయడంలో ప్రధానంగా నిలుస్తున్న బంగారం దిగుమతులకు ఎట్టకేలకు కళ్లెం పడింది. దిగుమతుల సుంకం పెంపు ఇతరత్రా ప్రభుత్వ, ఆర్‌బీఐ చర్యలు సత్ఫలితాలను ఇస్తున్నాయి. సెప్టెంబర్‌లో దేశంలోకి దిగుమతైన బంగారం, వెండి విలువ 0.8 బిలియన్ డాలర్లకు పడిపోవడం దీనికి నిదర్శనం. క్రితం ఏడాది ఇదే నెలతో పోలిస్తే(4.6 బిలియన్ డాలర్లు) వీటి దిగుమతులు ఏకంగా 80% క్షీణించడం గమనార్హం. ఇక ముడిచమురు(క్రూడ్) దిగుమతులు కూడా ఈ సెప్టెంబర్‌లో 6% దిగొచ్చి 13.19 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి.  కాగా, ఈ ఏడాది ఏప్రిల్-సెప్టెంబర్ కాలంలో బంగారం, వెండి దిగుమతులు 8.7% పెరిగి 23.1 బిలియన్ డాలర్లకు చేరాయి. గతేడాది ఆల్‌టైమ్ రికార్డు స్థాయిలో 4.8 శాతానికి(జీడీపీలో 88.2 బిలియన్ డాలర్లు) క్యాడ్ ఎగబాకడం తెలిసిందే. ఈ ఏడాది జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో  క్యాడ్ ఆందోళనకరంగా 4.9%కి దూసుకెళ్లడం గమనార్హం.

>
మరిన్ని వార్తలు