భారత్‌లో ఆర్థిక విశ్వాసం ఎక్కువే: ఇప్సాస్

7 Dec, 2013 02:28 IST|Sakshi
భారత్‌లో ఆర్థిక విశ్వాసం ఎక్కువే: ఇప్సాస్

న్యూఢిల్లీ: ఆర్థిక విశ్వాసం గణనీయంగా ఉన్న ప్రపంచదేశాల్లో భారత్‌కి ఏడో స్థానం దక్కింది. వ్యవసాయోత్పత్తి మెరుగుపడటం, కరెంటు ఖాతా లోటు క్రమంగా తగ్గుతుండటం తదితర సానుకూల అంశాలు ఇందుకు దోహదపడుతున్నాయి. అంతర్జాతీయ రీసెర్చ్ సంస్థ ఇప్సాస్ నివేదికలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం గత నెలలో భారత ఆర్థిక విశ్వాసం.. క్రితం నెలతో పోలిస్తే 11 పాయింట్లు పెరిగి 51 శాతానికి చేరింది. ఆర్థిక విశ్వాసం అత్యధికంగా ఉన్న దేశాల్లో సౌదీ అరేబియా (85 శాతం) అగ్రస్థానం దక్కించుకుంది. జర్మనీ, స్వీడన్, కెనడా, చైనా, ఆస్ట్రేలియా తర్వాత స్థానాల్లో ఉన్నాయి. 24 దేశాల్లో 18,083 మంది ఈ సర్వేలో పాల్గొన్నారు.  
 
 వ్యక్తిగత ఆర్థిక అంశాలను స్థానిక ఎకానమీ ప్రభావితం చేస్తుందని, దీంతో తమ పరిస్థితి మెరుగ్గా ఉందని ప్రతి పది మందిలో ముగ్గురు భారతీయులు (32 శాతం) ధీమా వ్యక్తం చేశారు. వచ్చే ఆరు నెలల కాలంలో తమ స్థానిక ఎకానమీ మరింత పటిష్టంగా ఉంటుందని ప్రతి పది మందిలో నలుగురు ధీమాగా ఉన్నారు. అలాగే భవిష్యత్‌లో స్థిరత్వం, వృద్ధిపైనా భారతీయులు చాలా ఆశావహంగా ఉన్నారు. భారత ఎకానమీకి గడ్డుకాలం ముగిసిందని.. ఇక ఇక్కణ్నుంచి సానుకూల వృద్ధి సాధించగలదని ఇప్సాస్ భారత విభాగం సీఈవో మిక్ గోర్డన్ తెలిపారు. క్యాడ్ తగ్గుతుండటం, ఎగుమతులు..తయారీ రంగం.. ఇన్వెస్టర్ల విశ్వాసం మెరుగుపడుతుండటం ఇందుకు దోహదపడతాయని ఆయన వివరించారు. వర్షపాతం బాగుండటంతో పంట దిగుబడులు పెరిగాయని, ఫలితంగా గ్రామీణప్రాంతాల్లో ట్రాక్టర్లు, మోటార్ సైకిళ్లు వంటి ఉత్పత్తులకు డిమాండ్ పెరిగిందని పేర్కొన్నారు. ఇది తయారీ రంగం వృద్ధికి ఉపయోగపడిందన్నారు.

మరిన్ని వార్తలు