ఆ ఎన్నారై టాప్ పెయిడ్ కమెడియన్!

22 Oct, 2015 12:38 IST|Sakshi

వాషింగ్టన్: ప్రముఖ ఇండియన్-అమెరికన్ కమెడియన్ అజిజ్ అన్సారీ తొలిసారి ఫోర్బ్స్ జాబితాలో చోటు సంపాదించారు. 2015 సంవత్సరంలో అత్యధిక వేతనం పొందిన కమెడియన్‌గా ఫోర్బ్స్ జాబితాలో ఆయనకు ఆరోస్థానం లభించింది. ఎన్బీసీ చానెల్‌లో ప్రసారమయ్యే 'పార్క్స్ అండ్ రియాక్షన్' కార్యక్రమంలో టామ్ హవర్‌ఫోర్డ్‌గా విశేష ప్రేక్షకాదరణ పొందిన ఆయన ఈ ఏడాది 9.5 మిలియన్ డాలర్ల సంపద ఆర్జించారని ఆ పత్రిక తెలిపింది. చాలామంది సెలబ్రిటీల మాదిరిగానే అన్సారీ ప్రస్థానం నాటకరంగం నుంచి టీవీ, పుస్తక రచన వరకు సాగిందని పేర్కొంది.

అన్సారీ రచించిన 'మోడ్రన్ రొమాన్స్' పుస్తకం ఆయనను మరో మెట్టు ఎక్కించింది. ప్రస్తుత మిలినీయంలో డేటింగ్, ప్రేమ వంటి అంశాలపై సామాజిక అధ్యయనం తరహాలో సాగిన ఈ రచన ఆయనకు ఆరోస్థానం కట్టబెట్టింది. 36 మిలియన్ డాలర్ల ఆర్జనతో జెర్రీ సీన్‌ఫెల్డ్ ఈ జాబితాలో టాప్ కమెడియన్‌గా నిలిచారు. 28.2 మిలియన్ డాలర్ల సంపదతో కెవిన్ హర్ట్, 21.5 మిలియన్ డాలర్ల సంపదతో టెర్రీ ఫాటర్ రెండు, మూడో స్థానాల్లో నిలిచారు. టెలివిజన్ కామెడీ బిజినెస్‌లో కొన్ని దశాబ్దాల నుంచి మహిళలు వెనుకంజలో ఉండటంతో వారికి ఈ జాబితాలో చోటులభించలేదని ఫోర్బ్స్ మ్యాగజీన్ పేర్కొంది.

మరిన్ని వార్తలు