నెల రోజుల కనిష్టానికి రూపాయి

7 Nov, 2013 02:31 IST|Sakshi
నెల రోజుల కనిష్టానికి రూపాయి

ముంబై: దేశీ కరెన్సీ మళ్లీ విలవిల్లాడింది. బుధవారం డాలరుతో రూపాయి మారకం విలువ ఒక్కరోజే 77 పైసలు దిగజారి 62.39 వద్ద స్థిరపడింది. గరిష్టస్థాయి నుంచి స్టాక్ మార్కెట్లు వరుసగా రెండోరోజూ క్షీణించడం, అమెరికా ఫెడరల్ రిజర్వ్ త్వరలోనే సహాయ ప్యాకేజీల ఉపసంహరించొచ్చన్న భయాలు మళ్లీ జోరందుకోవడం వంటివి రూపాయి పతనానికి పురిగొల్పినట్లు మార్కెట్ వర్గాలు పేర్కొన్నాయి. మరోపక్క బ్యాంకులు, దిగుమతిదారుల నుంచి డాలర్ల కొనుగోలు డిమాండ్ కూడా రూపాయిపై ప్రతికూల ప్రభావం చూపింది.

2 నెలల్లో అతిపెద్ద పతనం..: బుధవారం ఫారెక్స్ మార్కెట్లో రూపాయి ట్రేడింగ్.. క్రితం ముగింపు 61.62తో పోలిస్తే 61.93 వద్ద నష్టాలతో ప్రారంభమైంది.  చివరకు 1.25% క్షీణించి 62.39 వద్ద ముగిసింది. నెల రోజుల కనిష్టస్థాయికి పడిపోయింది. అక్టోబర్ 1న రూపాయి విలువ 62.46 వద్ద క్లోజైంది. కాగా, గత రెండు నెలల్లో ఇదే అతిపెద్ద పతనం కావడం గమనార్హం. మరోపక్క, దేశీయంగా చమురు కంపెనీల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక డాలరు స్వాప్ సదుపాయాన్ని ఆర్‌బీఐ త్వరలోనే నిలిపేయొచ్చన్న ఊహాగానాలు చెలరేగడం కూడా రూపాయి సెంటిమెంట్‌ను దిగజార్చిందని ఫారెక్స్ డీలర్లు, నిపుణులు అభిప్రాయపడ్డారు.
 

మరిన్ని వార్తలు