అట్టడుగున ఉన్నాం.. ఆదుకోండి

11 Mar, 2016 01:36 IST|Sakshi
అట్టడుగున ఉన్నాం.. ఆదుకోండి

పెట్టబడుల కోసమే లండన్ వెళుతున్నా: ఏపీ సీఎం
సాక్షి, న్యూఢిల్లీ: దక్షిణాది రాష్ట్రాలతో పోల్చితే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి సూచికల్లో వెనకబడి ఉందని, వాటితో సమాన బలం వచ్చేంతవరకు కేంద్రం చేయూతనివ్వాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్రానికి మరోసారి విన్నవించారు. పెట్టుబడులపై చర్చల కోసం లండన్ ప్రయాణమైన చంద్రబాబు గురువారం రాత్రి ఢిల్లీ చేరుకుని కేంద్ర హోం మంతి రాజ్‌నాథ్‌సింగ్, ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీతో భేటీ అయ్యారు. టీడీపీ పార్లమెంటరీ కార్యాలయంలో పార్టీ ఎంపీలతో చంద్రబాబు సమావేశమయ్యారు. ఈ సమావేశాల అనంతరం ఆయన  రాత్రి 10.15కు ఏపీభవన్‌లో మీడియా సమావేశంలో మాట్లాడారు.

‘‘గతంలో ప్రధాన మంత్రిని, ఆర్థిక మంత్రిని కలిసి రాష్ట్రం ఆర్థిక పరిస్థితిని వివరించాను. మళ్లీ ఈరోజు వివరించాను. విభజన వల్ల దక్షిణ భారతదేశంలో ఏపీ అన్ని విధాలుగా ఇబ్బందుల్లో ఉంది. 2014-15 తలసరి ఆదాయం లెక్కలు చూస్తే దక్షిణాదిన ఉన్న పొరుగు రాష్ట్రాల కంటే దాదాపు రూ.35 వేలు తక్కువగా ఉంది. తమిళనాడుకు చెన్నై, కర్ణాటకకు బెంగుళూరు, తెలంగాణకు హైదరాబాద్ ఉన్నాయి. కానీ ఏపీకి రాజధాని లేదు.

విభజన బిల్లులో ప్రత్యేక ప్యాకేజీ, విశాఖ జోన్, పన్ను ప్రోత్సాహకాలు, పోలవరం పూర్తి తదితర హామీలు పొందుపరిచారు. స్టీలు ప్లాంటు, దుగరాజపట్నం వంటివి పెట్టారు. రాజ్యసభకు వచ్చినప్పుడు స్పెషల్ స్టేటస్‌పై ఆనాటి ప్రధానమంత్రి హామీ ఇచ్చారు..’’ అని చెప్పారు. వీటన్నింటినీ త్వరితంగా పూర్తిచేయాలని కోరినట్లు తెలిపారు.
 
రాజధానిపై రాజకీయం చేస్తున్నారు
రాజధానిపై అనవసరంగా రాజకీయం చేస్తున్నారని ప్రతిపక్షాన్ని చంద్రబాబు విమర్శించారు  పెట్టుబడులు కోరేందుకు లండన్ వెళుతున్నట్లు చెప్పారు. కాపులకు ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటానని తెలిపారు. విలేకరుల సమావేశంలో పార్టీ ఎంపీలు కూడా పాల్గొన్నారు.
 
ఆ నమ్మకంతోనే గెలిచాం..
ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం ఏ తప్పూ చేయకపోయినా విభజనవల్ల నష్టపోయారని చంద్రబాబు చెప్పారు. ‘‘ఆనాటి కాంగ్రెస్ పార్టీ పూర్తిగా అన్యాయం చేసింది, ఫలితం అనుభవించింది. ఎన్డీయే ప్రభుత్వం హామీ ఇవ్వడంతో ప్రజలు నమ్మి గెలిపించారు. ఈ విషయమే ఆర్థిక మంత్రికి వివరించా. తొందర్లోనే న్యాయం చేస్తారని ఆశాభావం ఉంది. 2018 నాటికి పోలవరం పూర్తిచేస్తామన్నారు. పట్టిసీమపై కొందరు గందరగోళం చేస్తున్నారు. పోలవరం వచ్చే వరకు అదే కెనాల్‌ను వినియోగించుకుని పట్టిసీమ ద్వారా నీటిని రాయలసీమకు ఇస్తాం’’ అని తెలిపారు. తెలంగాణలో టీడీపీ ఎమ్మెల్యేలను టీఆర్‌ఎస్‌లో విలీనం చేయడం చెల్లదని, దానిపై న్యాయపోరాటం చేస్తామని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.

మరిన్ని వార్తలు