ఐసిస్పై పోరుకు అరివీర భయంకరుడు!

4 Jul, 2016 19:51 IST|Sakshi
ఐసిస్పై పోరుకు అరివీర భయంకరుడు!

బాగ్దాద్: 'బాహుబలి'లో కాలకేయుణ్ని చూసి 'వామ్మో..' అనుకున్నాం. అంతకు రెట్టింపు కండలు, భారీ శరీరంతో దాదాపు హల్క్ ను పోలిన ఈ ఇరానీ హెర్కులెస్.. ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులను మట్టికరిపిస్తానంటున్నాడు. పేరు సాజద్ ఘరీబీ. వయసు 24. ఉండేది కల్లోలిత ఇరాక్ లో. ప్రస్తుతం ఆ దేశంలో ఇరానీ సేనలకు, ఐఎస్ ఉగ్రవాదులకు భీకర యుద్ధం జరుగుతోంది. తన దేశంలో మళ్లీ శాంతి విరబూయాలంటే ఐఎస్ ను అంతం చేయక తప్పదంటోన్న సాజిద్.. ఇరానీ సైన్యంలో చేరతానని చెప్పాడు. యుద్ధ భూమిలో సైనికులతో కలిసి ఐఎస్ అంతుచూస్తానంటున్నాడు.

155 కిలోల బరువుండే ఈ బాడీ బిల్డర్.. 180 కిలోల బరువును అమాంతం ఎత్తి అవతల పారేయగలరు. సైన్యంలో చేరాలనే తన కోరికను వెల్లడిస్తూ ఇన్ స్టాగ్రామ్ లో అతను పోస్ట్ చేసిన ఫొటోలకు నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. ప్రస్తుతం సాజద్ కు 1.27లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. అయితే సైన్యంలో చేరేందుకు ఇంతలా ఉబలాటపడుతోన్న అతనిపై పెద్ద ఆరోపణ ఉంది. బందీల తలలను తెగనరికే కరడుగట్టిన ఐఎస్ ఉగ్రవాది 'ది బుల్డోజర్' సాజదే అని కొన్ని పత్రికలు పేర్కొంటున్నాయి. బుల్డోజర్ కూడా సాజద్ లాగే భారీ కాయుడు కావడంతో ఇలాంటి అపోహలు చెలరేగాయి. ఎవరేమి అనుకున్నా ఐఎస్ ను మట్టుపెట్టడమే నా లక్ష్యం అంటున్నాడు సాజద్ ఘరీబీ.


మరిన్ని వార్తలు