-

రామేశ్వరం చేరిన కలాం పార్థివదేహం

29 Jul, 2015 14:20 IST|Sakshi
రామేశ్వరం చేరిన కలాం పార్థివదేహం

రామేశ్వరం: మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం పార్థీవ దేహాన్ని ఆయన సొంతూరు తమిళనాడులోని రామేశ్వరానికి తీసుకెళ్లారు. బుధవారం మధ్యాహ్నం హెలికాప్టర్లో కలాం భౌతికకాయాన్ని తరలించారు. ఈ రోజు ఉదయం ఢిల్లీ పాలం విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో కలాం పార్థివదేహాన్ని మధురైకి తరలించి.. అక్కడి నుంచి హెలికాప్టర్లో తీసుకెళ్లారు. కలాం భౌతికకాయం వెంట కేంద్రమంత్రులు మనోహర్‌ పారికర్, వెంకయ్యనాయుడు వచ్చారు.

ఇదే గడ్డపై ఓ పేద కుటుంబంలో జన్మించి.. దేశం గర్వించదగ్గ శాస్త్రవేత్తగా ఎదిగి..  అత్యున్నత రాష్ట్రపతి పదవిని అలంకరించి.. దేశానికి ఎనలేని సేవలు అందించిన భారతరత్న కలాం .. చివరి సారిగా సొంతూరు రామేశ్వరానికి నిర్జీవంగా చేరుకున్నారు. కలాం పార్థివదేహాన్ని చూసి కుటుంబ సభ్యులు, బంధువులు, ఆత్మీయులు, ప్రజలు కన్నీటిపర్యంతమయ్యారు. కలాం భౌతికకాయాన్ని సందర్శించి, నివాళులు అర్పించేందుకు జనం బారులు తీరారు. కలాం చివరి దర్శనం కోసం బంధువులు అందరూ వచ్చారని, ఆత్మీయులు పెద్దసంఖ్యలో వచ్చారని ఆయన మనవడు ఏపీజే ఎంకే షేక్ సలీం చెప్పారు. రాత్రి 8 గంటలకు వరకు ప్రజల సందర్శనార్థం కలాం భౌతికకాయాన్ని రామేశ్వరం బస్టాండ్ సెంటర్ వద్ద ఉంచి,  ఆ తర్వాత ఇంటికి తీసుకువెళ్తామని తెలిపారు. రేపు ఉదయం కలాంకు అంత్యక్రియలు నిర్వహిస్తారు. ప్రధాని మోదీ సహా పలువురు ప్రముఖులు కలాం అంత్యక్రియల్లో పాల్గొంటారు.

మరిన్ని వార్తలు