ఖరీఫ్‌ నీటిపై ఏం తేలుస్తారో?

26 Aug, 2016 02:11 IST|Sakshi
ఖరీఫ్‌ నీటిపై ఏం తేలుస్తారో?

నేడే కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం
సాగర్‌ కుడి, ఎడమ కాల్వల కింద నీటి విడుదలపై చర్చలు
30 టీఎంసీలు కోరుతున్న తెలంగాణ
37 టీఎంసీలు కావాలంటున్న ఏపీ

సాక్షి, హైదరాబాద్‌: నాగార్జున సాగర్‌ కుడి, ఎడమ కాల్వల కింద ఖరీఫ్‌ సాగు అవసరాల కోసం నీటి విడుదలే ఎజెండాగా శుక్రవారం కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం జరగనుంది. నీటిపారుదలశాఖ కార్యాలయంలోని జలసౌధలో జరిగే ఈ సమావేశానికి బోర్డు తాత్కాలిక చైర్మన్‌ రామ్‌శరణ్‌తోపాటు సభ్య కార్యదర్శి సమీరా చటర్జీ, ఇరు రాష్ట్రాల నీటిపారుదలశాఖల ముఖ్య కార్యదర్శులు, ఈఎన్‌సీలు హాజరుకానున్నారు. ఇప్పటికే సాగర్‌ కింద రాష్ట్ర అవసరాలను పేర్కొంటూ ఈఎన్‌ సీ మురళీధర్‌ బోర్డు సభ్య కార్యదర్శి సమీర్‌ చటర్జీకి లేఖ రాశారు. సాగర్‌ ఎడమ కాల్వ కింద సాగు అవసరాలకు 30 టీఎంసీలు, ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టు (ఏఎంఆర్‌పీ) కింద తాగు అవసరాలకు 5 టీఎంసీలు విడుదల చేయాలని కోరారు. ఆవిరి నష్టాలు, సీపే జీ నష్టాలు ఉండే అవకాశాల దృష్ట్యా మరో 4 టీఎంసీలు అదనంగా విడుదల చేయాలని విన్నవించారు. శ్రీశైలంలో ప్రస్తుతం 165 టీఎంసీల మేర నీరు లభ్యతగా ఉందని, ఇందులో కనీస నీటిమట్టం 834 అడుగులకుపైన 118 టీఎంసీల మేర నీటి లభ్యత ఉందని పేర్కొన్నారు. ఇందులో తెలంగాణ, ఏపీలు ఇప్పటికే 19.5 టీఎంసీలు పంచుకోగా దాదాపు మరో 98 టీఎంసీల నీరు ఉందని, ఈ నీటిలోంచే తమకు 39 టీఎంసీలు విడుదల చేయాలని కోరారు.

దీనిపై సానుకూలంగా స్పందిం చిన బోర్డు తొలి విడతగా ఇప్పటికే 3 టీఎం సీల నీటి విడుదలకు అనుమతి ఇచ్చింది. ఈ నీటి విడుదల సైతం మొదలైంది. మిగతా నీటి విడుదలపై ఏపీతో చర్చించి బోర్డు నిర్ణయం చెప్పాల్సి ఉంది. మరోవైపు హంద్రీనీవా ద్వా రా రోజూ 2,020 క్యూసెక్కుల చొప్పున నీటిని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తరలిస్తోంది. దీనికితోడు పోతిరెడ్డిపాడు ద్వారా కొన్ని రోజుల నుంచి ఏకంగా ఒక టీఎంసీ చొప్పున నీటిని తీసుకుంటోంది. ముందస్తు సమాచారం లేకుండా ఏపీ సాగిస్తున్న నీటి మళ్లింపుపై తెలంగాణ ఇప్పటికే అభ్యంతరాలు లేవనెత్తింది. దీనిపై సైతం బోర్డు ఏపీతో చర్చిం చాల్సి ఉంది. ఇదే సమయంలో సాగర్‌ కుడి కాల్వ, కేసీ కెనాల్, తెలుగు గంగ కింద సాగు అవసరాల కోసం 37 టీఎంసీల నీటి కేటాయింపులు చేయాలని ఏపీ కోరుతోంది. ఈ నేపథ్యంలో శ్రీశైలం, సాగర్‌లో నీటి లభ్యత, నిల్వలు, అవసరాలను దృష్టిలో పెట్టుకొని బోర్డు నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. సాగర్, శ్రీశైలం ప్రాజెక్టుల వద్ద ఏర్పాటు చేయాల్సిన టెలీమెట్రీ విధానం అమలు, వాటికి బడ్జెట్‌ కేటాయింపు అంశాలపైనా బోర్డు ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది.

మరిన్ని వార్తలు