అవి నా ప్రతిష్టకు పరీక్ష: ములాయం

12 Jan, 2014 03:10 IST|Sakshi
అవి నా ప్రతిష్టకు పరీక్ష: ములాయం

ఝాన్సీ: ప్రధాని పీఠం అధిరోహించాలన్న తన మనోగతాన్ని సమాజ్‌వాది పార్టీ అధినేత ములాయంసింగ్ యాదవ్ మరోసారి బయటపెట్టారు. వచ్చే లోక్‌సభ ఎన్నికలు తన ప్రతిష్టకు సంబంధించినవని, ఈ ఎన్నికల్లో ఎస్పీకి మెజారిటీ స్థానాలు కట్టబెట్టాలని ప్రజలను కోరారు. దేశంలో సమృద్ధిగా ఆహార ధాన్యాలు ఉత్పత్తి అవుతున్నా.. నేటికీ ఆకలి చావులు చోటుచేసుకుంటున్నాయని, ఇందుకు యూపీఏ ప్రభుత్వ అసమర్థతే కారణమని దుయ్యబట్టారు. శనివారమిక్కడ నిర్వహించిన ‘దేశ్ బచావో, దేశ్ బనావో’ ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘‘అధిక ధరలను అరికట్టలేనివారిని, దేశం నుంచి పేదరికాన్ని పారదోలలేని వారిని అధికారం నుంచి తప్పించాల్సిన సమయం వచ్చింది.
 
 మొదటిసారిగా చెబుతున్నా.. వచ్చే ఎన్నికలు నా ప్రతిష్టకు సంబంధించినవి. దేశాన్ని అభివృద్ధి పంథాలో నడిపేందుకు సమాజ్‌వాది పార్టీకి ఒక అవకాశం ఇవ్వాలని ప్రజలను కోరుతున్నా’’ అని అన్నారు. రైతులు దేశానికి చాలినంత ఆహార ధాన్యాలను పండిస్తున్నా.. యూపీఏ సర్కారు దేశం నుంచి ఆకలిని పారదోలలేకపోయిందని విమర్శించారు. వ్యవసాయాధారిత దేశంలో ఆకలి చావులు చూడాల్సిన దుస్థితి తలెత్తిందన్నారు. ఇంతటి సిగ్గుమాలిన, బలహీనమైన ప్రభుత్వం ఇంతకుముందెప్పుడూ లేద ని మండిపడ్డారు. మైనారిటీలను అనుమానంగా చూడొద్దని, ఈ దేశాభివృద్ధిలో రైతుల పాత్ర ఎంత ఉందో.. ముస్లింల పాత్ర కూడా అంతే ఉందని చెప్పారు. ‘‘మనం ధరించే దుస్తుల్లో 80 శాతం ముస్లింలు తయారు చేస్తున్నవే. దేశ భద్రతకు వినియోగిస్తున్న చాలా ఆయుధాలు కూడా వారు తయారుచేస్తున్నవే’’ అని అన్నారు.

మరిన్ని వార్తలు