భూ ప్రభావాన్ని దాటిన ‘మామ్’

5 Dec, 2013 06:26 IST|Sakshi

సూళ్లూరుపేట, న్యూస్‌లైన్: భారత అంతరిక్ష పరిశోధన కేంద్రం (ఇస్రో) అంగారకునిపైకి ప్రయోగించిన ‘మార్స్ ఆర్బిటర్ మిషన్’ (మామ్)(మంగళ్‌యాన్) వ్యోమనౌక బుధవారం పూర్తిగా భూ ప్రభావాన్ని దాటింది. ‘ఇస్రో’ శాస్త్రవేత్తలు నవంబర్ 5న శ్రీహరికోట నుంచి ప్రయోగించిన ‘మంగళయాన్’ ఇటీవల భూకక్ష్యను విజయవంతంగా అధిగమించి, అంగారకుని వైపు తన పది నెలల ప్రయాణాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. భూకక్ష్యను దాటిన తర్వాత కూడా భూమి నుంచి 9.25 లక్షల కిలోమీటర్ల దూరం వరకు భూ ప్రభావం ఉంటుంది. ‘మామ్’ ఈ పరిధిని కూడా బుధవారం వేకువ జామున 1.14 గంటలకు దాటినట్లు ‘ఇస్రో’ వెల్లడించింది.
 

మరిన్ని వార్తలు