మార్కెట్లోకి ఫియట్ లినియా ‘క్లాసిక్’

26 Sep, 2013 01:20 IST|Sakshi
మార్కెట్లోకి ఫియట్ లినియా ‘క్లాసిక్’

న్యూఢిల్లీ: పండుగల సీజన్ సందర్భంగా ఫియట్ కంపెనీ లినియా క్లాసిక్ పేరుతో కొత్త కారును బుధవారం మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ కారుతో ఎంట్రీ లెవల్ సెడాన్ సెగ్మెంట్లోకి ప్రవేశిస్తున్నామని ఫియట్ గ్రూప్ ఆటోమొబైల్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్(ఎఫ్‌జీఏఐపీఎల్) తెలిపింది. ఈ కారు ధరలు రూ.5.99 లక్షల నుంచి రూ.7.51 లక్షల రేంజ్‌లో (ఎక్స్ షోరూమ్, న్యూఢిల్లీ) ఉన్నాయని ఫియట్ క్రిస్లర్ ఇండియా ప్రెసిడెంట్, ఎండీ నగేష్ బసవనహళ్లి చెప్పారు. ఈ కారును 3 వేరియంట్లలో(ఒకటి పెట్రోల్, రెండు డీజిల్), ఐదు రంగుల్లో  అందిస్తున్నామని పేర్కొన్నారు. సెడాన్ విలాసాలను హ్యాచ్‌బాక్ ధరకే పొందేలా ఈ లినియా క్లాసిక్‌ను రూపొందించామని,  అధునాతన ఫీచర్లను అందుబాటు ధరలో అందిస్తున్నామని వివరించారు. కార్ల వారంటీని మూడేళ్ల నుంచి ఐదేళ్లకు పెంచామని, డీలర్ల నెట్‌వర్క్‌ను, సర్వీసింగ్ సెంటర్లను విస్తరిస్తున్నామని వివరించారు.
 
 ప్రత్యేకతలు: లినియా క్లాసిక్‌లో హైడ్రాలిక్ పవర్ స్టీరింగ్, ప్రోగ్రామబుల్ స్పీడ్ లిమిట్ బజర్, డ్యుయల్ పారబోలా హెడ్‌ల్యాంప్స్,  అగ్ని ప్రమాదాలను నివారించే సిస్టమ్ వంటి ప్రత్యేకతలున్నాయి. ఈ కారు మారుతి స్విఫ్ట్ డిజైర్, హోండా అమేజ్, ఫోర్డ్ ఫియస్టా క్లాసిక్, టయోటా ఇటియోస్, షెవర్లే సెయిల్, నిస్సాన్ సన్నీలకు గట్టిపోటీనిస్తుందనేది పరిశ్రమ వర్గాల అంచనా.

మరిన్ని వార్తలు