ప్రతిపక్ష నేతపై సీఎం గూఢచర్యం!

4 Sep, 2015 15:46 IST|Sakshi
ప్రతిపక్ష నేతపై సీఎం గూఢచర్యం!

ఏడాది కిందటివరకు ఆయన ముఖ్యమంత్రి. ఫైళ్ల మీద సంతకాలు, ఇంటర్వ్యూలు, సిఫార్సులు అంటూ రోజుకు వందల మంది ఆయన ఇటికి వెళ్లేవారు. చిన్నపాటి భద్రతా తనిఖీలు తప్ప  ఆయన్ని కలవడానికి వెళ్లేవారికి పెద్ద ఇబ్బందులేవీ ఉండేవికావు. ఇప్పుడు పదవి పోయింది. సీన్ మొత్తం మారిపోయింది.

 

తన మీద ప్రభుత్వం నిశితంగా గూఢచర్యం చేస్తోందని అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. తన ఇంటికి ఎవరెవరు వస్తున్నారు, ఏ పని మీద వస్తున్నారు.. ఇలాంటి వివరాలన్నీ సేకరిస్తున్నారంటూ మండిపడుతున్నారు. ప్రస్తుతం జమ్ముకాశ్మీర్లో సంచలనం రేపుతున్న ఈ వ్యవహారంలో బాధితుడు.. ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత ప్రతిపక్ష నేత ఒమర్ అబ్దుల్లా!

గూఢచర్యం విషయమై శుక్రవారం ట్విట్టర్లో స్పందించిన ఒమర్.. 'ముఫ్తీ సర్కార్ నాపై గూఢచర్యం చేస్తోంది. అంతగా నాగురించి వివరాలు కావాలనుకుంటే నేరుగా నాకే ఫోన్ చేసి అడగొచ్చు. కానీ ఇలాంటి సిగ్గుమాలిన చర్యలు ఎంతవరకు సబబు?' అని ప్రశ్నించారు.

ఓ జాతీయ పత్రికకు చెందిన జర్నలిస్టు.. ఒమర్ను ఆయన ఇంట్లో ఇంటర్వ్యూ చేసి బయటకు వెళ్తుండగా సీఐడీ అధికారులు అడ్డుపడి.. ఆమె వివరాలు, ఏయే ప్రశ్నలకు ఒమర్ ఎలా సమాధానమిచ్చారు? తదితర వివరాలు సేకరించారట. ఈ విషయం తెలుసుకున్న వెంటనే ఒమర్.. తనపై గూఢచర్యం జరుగుతోందంటూ ట్వీట్లు చేశారు. 'డియర్ ముఫ్తీ సాబ్.. మీ టెలిఫోన్ తీసి నాకు కాల్ చేయొచ్చు. ఎలాంటి విషయమైనా నన్నడగొచ్చు. కానీ నా ఇంటికొచ్చేవారిని ఇబ్బంది పెట్టకండి' అంటూ మండిపడ్డారు.

 

మరిన్ని వార్తలు