జోరుగా కొత్త కొలువుల

16 Sep, 2013 01:26 IST|Sakshi
జోరుగా కొత్త కొలువుల
న్యూఢిల్లీ: రూపాయి బలపడుతుండటంతో రానున్న నెలల్లో కొత్త ఉద్యోగాలివ్వడానికి కంపెనీలు ముందుకు రానున్నాయని నిపుణులంటున్నారు. రూపాయి పతనం కారణంగా గత కొన్ని నెలలుగా కొత్త ఉద్యోగాల ఎంపికను పలు కంపెనీలు వాయిదా వేశాయి.   ఆర్‌బీఐ, ప్రభుత్వం తీసుకున్న ఇటీవలి చర్యల కారణంగా రూపాయి బలపడడం, మార్కెట్ సెంటిమెంట్ మెరుగుపడడం, మంచి రోజులు రానున్నాయన్న వాతావరణం ఏర్పడిందని వారంటున్నారు. దీంతో వాయిదా వేసిన ఉద్యోగాల భర్తీతో పాటు, కీలకమైన వ్యాపార విభాగాల్లో కూడా ఉద్యోగాల నియామకాలను కంపెనీలు చేపట్టనున్నాయని పలువురు నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
 
  ఇలాంటి సానుకూల పరిస్థితుల కారణంగా పెట్టుబడులు పెరుగుతాయని, కంపెనీలు విస్తరణ ప్రయత్నాలు చేస్తాయని, ఫలితంగా రానున్న రోజుల్లో జోరుగా కొత్త కొలువులు వస్తాయని కెరీర్ బిల్డర్ ఎండీ ప్రేమీష్ మచమ చెప్పారు. అధ్వాన పరిస్థితులు త్వరలోనే అంతమవుతాయని, ఈ ఏడాది ద్వితీయార్ధంలో  కంపెనీలు కొత్త ఉద్యోగాలివ్వనున్నాయని ఇన్ఫోఎడ్జ్(ఇండియా) సీఈవో, ఎండీ హితేష్ ఒబెరాయ్ చెప్పారు. ఈ సంస్థ ఇన్ఫోఎడ్జ్(ఇండియా) నౌకరీడాట్‌కామ్‌ను నిర్వహిస్తోంది. మ్యాన్‌పవర్ ఎంప్లాయ్‌మెంట్ అవుట్‌లుక్ సర్వే కూడా కొత్త కొలువులకు సంబంధించి ఆశావహ దృశ్యాన్నే ఆవిష్కరించింది. కొత్త ఉద్యోగాల విషయమై, అత్యంత ఆశావహ దేశంగా భారత్ అవతరించిందని ఈ సర్వే ఇటీవలనే పేర్కొంది. ఐటీ, ఐటీ అనుబంధ సంస్థల్లో రికవరీయే దీనికి ప్రధాన కారణమని పేర్కొంది. 
 
>
మరిన్ని వార్తలు