నాయనమ్మ బాటలోనే రాహుల్

23 Apr, 2015 19:44 IST|Sakshi
నాయనమ్మ బాటలోనే రాహుల్

న్యూఢిల్లీ: కేదార్ నాథ్ ఆలయానికి బయలుదేరిన కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ తాను హెలికాప్టర్ పంపిస్తానని చెప్పినా వద్దన్నారని ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి హరీశ్ రావత్ తెలిపారు. గౌరికుంద్ నుంచి కేదార్ నాథ్ వరకు ఆయన మొత్తం 17 కిలో మీటర్లు నడిచి వెళ్తారని చెప్పారు. చాలా రోజుల విరామం తర్వాత తిరిగి వచ్చిన రాహుల్ వారం రోజులుగా పార్లమెంటులో ప్రతిపక్ష స్థానంలో ధీటుగా స్పందిస్తూ తన పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపుతున్న విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలోనే ఆయన కేదార్ నాథ్ ఆలయానికి నడుచుకుంటూ వెళ్లి దర్శించుకోవాలనుకుంటున్నట్లు ప్రకటించారు కూడా. దీనిపైనే హరీశ్ రావత్ మాట్లాడుతూ 36 సంవత్సరాల క్రితం 1979లో రాహుల్ నాయనమ్మ మాజీ ప్రధాని ఇందిరాగాంధీ కూడా 40 కిలో మీటర్లు కాలినడకన వెళ్లి బద్రీనాథ్ను దర్శించుకున్నారని చెప్పారు. ఆ సమయంలో తాను ఇందిరతో ఉన్నానని, ఇప్పుడు రాహుల్తోనని నాడు ఇందిరా బద్రీనాథ్ బాబా దీవెనలు పొందితే ఇపుడు రాహుల్ కేదార్ బాబా దీవెనలు పొందనున్నారని చెప్పారు. శుక్రవారం ఉదయం 8.30 గంటలకు కాలినడకన ఆలయాన్ని చేరుకొని రాహుల్ ప్రత్యేక పూజలు నిర్వహిస్తారని చెప్పారు. ఇప్పటికే రాహుల్ మరికొందరు నేతలతో కలసి కేదార్ నాథ్ బయలు దేరారు.

మరిన్ని వార్తలు