‘క్షమాభిక్ష’ మార్గదర్శకాలపై పిల్

1 Dec, 2013 01:49 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్: క్షమాభిక్ష పేరుతో జీవిత ఖైదీల విడుదలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలు చట్టవిరుద్ధమైనవిగా ప్రకటించాలని కోరుతూ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలైంది. ‘వాచ్-వాయిస్ ఆఫ్ ది పీపుల్’ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి పి.నారాయణస్వామి ఈ పిల్‌ను దాఖలు చేశారు. గాంధీ జయంతి, స్వాతంత్య్ర దినోత్సవం, రిపబ్లిక్ డేల సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక రెమిషన్ పేరుతో పదేళ్ల జైలు శిక్ష పూర్తి చేసుకున్న జీవితఖైదీలను విడుదల చేస్తోందని కోర్టుకు తెలిపారు.

 

ప్రభుత్వం వివక్షాపూరితంగా మార్గదర్శకాలు రూపొందించడంతో కొందరు ఖైదీలు మాత్రమే విడుదలవుతున్నారని ఆరోపించారు. మార్గదర్శకాల జారీలో ఎటువంటి వివక్ష లేకుండా చూడాలని, జీవితఖైదు అనుభవిస్తున్న ఖైదీలందరికీ వర్తించేలా వీటిని రూపొందించేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని పిటిషన్‌లో కోరారు. హోంశాఖ ముఖ్యకార్యదర్శి (పెరోల్)ని, జైళ్ల శాఖ డెరైక్టర్ జనరల్‌ను ప్రతివాదులుగా పేర్కొన్నారు. ఈ పిల్ సోమవారం విచారణకు వచ్చే అవకాశం ఉంది.


 రాష్ట్ర విభజనపై మరో పిటిషన్
 రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ హైకోర్టులో మరో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. అనంతపురం జిల్లాకు చెందిన న్యాయవాది నారాయణస్వామి ఈ పిల్ దాఖలు చేశారు. రాష్ట్ర విభజనకు సంబంధించి అక్టోబర్ 3న ప్రకటించిన కేబినెట్ నోట్‌ను చట్టవిరుద్ధమైనదిగా ప్రకటించాలని, పెద్ద మనుషుల ఒప్పందానికి లోబడి ఉండేలా కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని అందులో కోరారు.

మరిన్ని వార్తలు