తోటి పెళ్లికూతురు నుంచి పెళ్లి కూతురు దాకా...

21 May, 2017 03:24 IST|Sakshi
తోటి పెళ్లికూతురు నుంచి పెళ్లి కూతురు దాకా...

వివాహం చేసుకున్న కేట్‌ చెల్లి పిప్పా మిడిల్‌టన్‌
ఇంగిల్‌ఫీల్డ్‌: సోదరి పెళ్లిలో తోడి పెళ్లికూతురిగా వ్యవహరించి ప్రపంచం దృష్టిని ఆకర్షించిన డచెస్‌ ఆఫ్‌ కేంబ్రిడ్జి కేట్‌ చెల్లెలు పిప్పా మిడిల్‌టన్‌ శనివారం పెళ్లికూతురయ్యారు. లండన్‌లోని ఇంగిల్‌ఫీల్డ్‌ అనే ఓ మారుమూల గ్రామంలో ఉన్న చర్చిలో పిప్పా(33), 41 ఏళ్ల ఫైనాన్షియర్‌ జేమ్స్‌ మాథ్యూస్‌ను వివాహం చేసుకున్నారు. 2011లో కేట్‌–విలియం పెళ్లిలో తన దుస్తుల ద్వారా పిప్పా మీడియాలో సంచలన వార్తగా నిలిచారు. తెలుపు రంగు అలెగ్జాండర్‌ మెక్‌క్వీన్‌ మేడ్‌ దుస్తుల్లో ఆమె, టీవీలో పెళ్లిని చూసిన సుమారు 2 కోట్ల మంది దృష్టిలో తొలిసారి పడ్డారు. ఆ తరువాత కూడా తరచూ వార్తా పత్రికల్లో ఆమె గురించి ఎన్నో కథనాలు ప్రచురితమయ్యాయి. టెన్నిస్‌ అంటే ఎంతో అభిమానం చూపే పిప్పా వింబుల్డన్‌ టోర్నమెంట్‌ మ్యాచ్‌లకు తరచుగా హాజరవుతారు.

పిప్పా వివాహానికి సోదరి కేట్, బావ విలియమ్, రాజ కుటుంబీకులతో పాటు టెన్నిస్‌ స్టార్‌ రోజర్‌ ఫెదరర్‌ తన భార్యతో కలిసి హాజరయ్యారు. బ్రిటిష్‌ డిజైనర్‌ గైల్స్‌ డీకాన్‌ రూపొందించిన దుస్తులను పిప్పా ధరించారు. తన తండ్రితో కలసి వివాహ వేదికకు చేరుకున్న పిప్పాకు స్థానిక గ్రామస్తులు స్వాగతం పలికారు. రాజ కుటుంబ పెద్దలు అధిక సంఖ్యలో హాజరవడంతో ఆ గ్రామంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. డ్రోన్లు సహా మరే ఇతర విమానాలు ప్రయాణించకుండా నిషేధం విధించారు.
 


 

మరిన్ని వార్తలు