నిరాడంబరంగా బ్రిటన్‌ రాణి పుట్టినరోజు వేడుకలు

22 Apr, 2017 09:27 IST|Sakshi

లండన్‌: బ్రిటన్‌ రాణి ఎలిజబెత్‌ 2 తన 91వ పుట్టినరోజును శుక్రవారం ఎలాంటి ఆర్భాటం లేకుండా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆమె అధికార నివాసం బకింగ్‌హాం ప్యాలెస్‌ 1926 మే నాటి 10 రోజుల చిన్నారి ఎలిజబెత్‌ ఫొటోను విడుదల చేసింది. ఆమెకు నామకరణం చేస్తున్నపుడు తీసిన ఈ నలుపు, తెలుపు ఫొటోలో ఎలిజబెత్‌ తన తల్లిదండ్రుల చేతుల్లో కనినిస్తున్నారు.

వేల్స్‌ రాజకుమారుడు క్లారెన్స్‌ హౌస్, ఆయన భార్య కామిల్లా 1952 నాటి యువకురాలైన రాణి, ఆమె భర్త ప్రిన్స్‌ చార్లెస్‌కు చెందిన మరో ఫొటోను ట్వీటర్‌లో పంచుకున్నారు. రాణికి గౌరవ సూచకంగా హైడ్‌ పార్క్‌లో 41 తుపాకులతో, టవర్‌ ఆఫ్‌ లండన్‌లో 62 తుపాకులతో, విండ్సార్‌ క్యాపిటల్‌లో 21 తుపాకులతో సైనికులు గాల్లోకి కాల్పులు జరిపారు.

థాయ్‌లాండ్‌ రాజు భూమిబల్‌ మరణంతో, సుదీర్ఘకారం రాచరిక విధుల్లో కొనసాగుతున్న, అత్యంత వయస్కురాలైన పరిపాలకురాలిగా ఎలిజబెత్‌ ఖ్యాతి గడించారు. 1926, ఏప్రిల్‌ 21న అప్పటి యార్క్‌ యువరాజు, యువరాణికి ఎలిజబెత్‌ తొలి సంతానంగా జన్మించారు. 1952, ఫిబ్రవరి 6న బ్రిటన్‌కు రాణి అయిన ఎలిజబెత్‌ ఈ ఏడాది అదే రోజుకి ఈ పదవిలో 65 ఏళ్లు పూర్తిచేసుకున్నారు. ఈ ఘనత సాధించిన తొలి బ్రిటన్‌ పరిపాలకురాలు ఈమెనే కావడం విశేషం. అయితే రాణి తన అధికారిక పుట్టిన రోజును మాత్రం జూన్‌ 17న జరుపుకుంటారు. ఈ సందర్భంగా యూకే వ్యాప్తంగా పలు కార్యక్రమాలు నిర్వహించనున్నారు.    

మరిన్ని వార్తలు