రాజన్ మళ్లీ ‘వడ్డి’స్తారా..?

28 Oct, 2013 12:26 IST|Sakshi
రాజన్ మళ్లీ ‘వడ్డి’స్తారా..?

న్యూఢిల్లీ: ధరల మంట తీవ్రతరం అవుతుండటంతో రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ) మరో విడత వడ్డీరేట్లు పెంచే అవకాశాలు కనబడుతున్నాయి. ఈ నెల మంగళవారం(29న) చేపట్టనున్న రెండో త్రైమాసిక పరపతి విధాన సమీక్షలో పాలసీ వడ్డీరేటు(రెపో)ను పావు శాతం పెంచొచ్చని బ్యాంకర్లు అంచనా వేస్తున్నారు. అదేవిధంగా ద్రవ్య సరఫరా(లిక్విడిటీ)ని పెంచే చర్యలు కూడా ఉండొచ్చనేది వారి అభిప్రాయం.
 
‘కీలక పాలసీ రేటు రెపోను పావు శాతం పెంచవచ్చని భావిస్తున్నాం. లిక్విడిటీని మరింత మెరుగుపరిచేందుకు వీలుగా.. మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ(ఎంఎస్‌ఎఫ్)ని కూడా పావు శాతం తగ్గించే అవకాశాలున్నాయి’ అని బ్యాంక్ ఆఫ్ బరోడా ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ రంజన్ ధావన్ పేర్కొన్నారు. ఓపెన్ మార్కెట్ కార్యకలాపాలద్వారా లేదంటే ఎంఎస్‌ఎఫ్ తగ్గింపు రూపంలో ద్రవ్యసరఫరాను పెంచే చాన్స్ ఉందని ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ సీఎండీ ఎం.నరేంద్ర అభిప్రాయపడ్డారు. ఎస్‌బీఐ ముఖ్య ఆర్థిక సలహాదారు సౌమ్య కాంతి ఘోష్ మాట్లాడుతూ... పెరుగుతున్న ద్రవ్యోల్బణానికి అడ్డుకట్టవేసేందుకు రెపో రేటును పావు శాతం పెంచొచ్చని అంచనా వేశారు. ఇదేతరుణంలో బ్యాంకులకు నిధుల సమీకరణ వ్యయాన్ని తగ్గించేందుకు ఎంఎస్‌ఎఫ్‌ను కూడా తగ్గించాల్సిన అవసరం ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు.
 
ఆర్‌బీఐ కొత్తగవర్నర్‌గా సెప్టెంబర్‌లో బాధ్యతలు చేపట్టిన రఘురామ్ రాజన్... తన తొలి పాలసీ సమీక్షలోనే అనూహ్యంగా వడ్డీరేట్ల పెంపు నిర్ణయాన్ని తీసుకున్న సంగతి తెలిసిందే. ద్రవ్యోల్బణానికి అడ్డుకట్టవేయడమే లక్ష్యమని ప్రకటిస్తూ... రెపో రేటును పావు శాతం పెంచారు. దీంతో ఇది 7.5 శాతానికి చేరింది. ఇక రివర్స్ రెపో 6.5 శాతంగా ఉంది. గత సమీక్షలో నగదు నిల్వల నిష్పత్తి(సీఆర్‌ఆర్)ను యథాతథంగా 4 శాతంగానే ఉంచారు. అయితే, ఎంఎస్‌ఎఫ్‌ను ముప్పావు శాతం తగ్గించి 9.5 శాతానికి చేర్చారు. తాజాగా మళ్లీ ఈ రేటును మరో అర శాతం తగ్గించడంతో 9 శాతానికి దిగొచ్చింది. బ్యాంకులకు ద్రవ్యసరఫరా కొరత భారీగా తలెత్తినప్పుడు అధిక వడ్డీరేటుకు ఆర్‌బీఐ నుంచి నిధులను తీసుకోవడం కోసం ఎంఎస్‌ఎఫ్ ఉపయోగపడుతుంది.
 
 ద్రవ్యోల్బణం సెగ...
 గత రెండు నెలలుగా ధరలు దూసుకెళ్తుండటం... ఆర్‌బీఐ వడ్డీరేట్ల పెంపునకు పురిగొల్పుతోంది. ఆహారోత్పత్తులు  ప్రధానంగా ఉల్లిపాయలు, కూరగాయల రేట్లు చుక్కలనంటుతున్న సంగతి తెలిసిందే. కేజీ ఉల్లి రేటు కొన్ని నగరాల్లో ఏకంగా రూ.100కు చేరి దడపుట్టిస్తోంది. ఇది సామాన్యులపై మరింత ధరాభారాన్ని మోపుతోంది. కాగా, సెప్టెంబర్‌లో టోకు ధరల ఆధారిత(డబ్ల్యూపీఐ) ద్రవ్యోల్బణం ఏడు నెలల గరిష్టానికి(6.46 శాతం) ఎగబాకడం ఆర్‌బీఐ పాలసీ రేట్ల పెంపునకు దారితీసే అంశంగా నిలవనుంది. ఆగస్టులో ద్రవ్యోల్బణం 6.1%, జూలైలో 5.85 శాతంగా నమోదైంది. సెప్టెంబర్‌లో ఉల్లి ధర ఏకంగా 323 శాతం దూసుకెళ్లడం గమనార్హం. కాగా, రిటైల్ ద్రవ్యోల్బణం రేటు ఆగస్టులో 9.52 శాతంగా ఉండగా... సెప్టెంబర్‌లో 9.84 శాతానికి చేరడం కూడా పాలసీపై ప్రభావం చూపనుంది.
 
పావు శాతం పెంచొచ్చు: అసోచామ్
టోకు, రిటైల్ ధరల ద్రవ్యోల్బణాలు రెండూ అధికంగా ఉండటంతో రానున్న పాలసీ సమీక్షలో ఆర్‌బీఐ రెపో రేటును పావు శాతం మేర పెంచే అవకాశాలున్నాయని పారిశ్రామిక వర్గాలు కూడా భావిస్తున్నాయి. ఆర్‌బీఐ వడ్డీరేట్లను మరోవిడత పెంచొచ్చని... స్వల్పకాలానికి పరిశ్రమలకు సమస్యలు తప్పవని అసోచామ్ ప్రెసిడెంట్ రాణా కపూర్ వ్యాఖ్యానించారు. 

అయితే రెపో, ఎంఎస్‌ఎఫ్ మధ్య వ్యత్యాసానికి సాధారణ స్థాయికి(1 శాతానికి) చేర్చాల్సిన అవసరం ఉందన్నారు. ప్రస్తుతం ఈ వ్యత్యాసం 1.5 శాతంగా ఉంది. ఐదు రాష్ట్రాల ఎన్నికలు, ప్రస్తుత పండుగల సీజన్ కారణంగా 70,000-80,000 కోట్లను బ్యాంకింగ్ వ్యవస్థ నుంచి విత్‌డ్రా చేసే అవకాశం ఉందని, దీనివల్ల ఉత్పాదక రంగాలకు రుణ సరఫరాలపై ప్రతికూల ప్రభావం చూపొచ్చన్నారు. దీన్ని తట్టుకోవడానికి ఎంఎస్‌ఎఫ్ తగ్గింపు లేదా సీఆర్‌ఆర్‌లో అర శాతం కోత వంటి చర్యలు చేపట్టాలని  ఆయన సూచించారు.

>
మరిన్ని వార్తలు