సీఎం బంధువును దారుణంగా చంపేశారు

11 Feb, 2017 10:06 IST|Sakshi
సీఎం బంధువును దారుణంగా చంపేశారు

చండీగఢ్‌: హిమాచల్ ప్రదేశ్‌ ముఖ్యమంత్రి వీరభద్ర సింగ్ సమీప బంధువును అతని స్నేహితులు దారుణంగా చంపారు. బీఎండబ్ల్యూ కారును ఆయనపై మూడుసార్లు తొక్కించడంతో తీవ్రంగా గాయపడి మరణించాడు. చండీగఢ్లో ఈ సంఘటన జరిగింది.

వీరభద్ర సింగ్ భార్య ప్రతిభా సింగ్‌కు మేనల్లుడు ఆకాంశ్ సింగ్ (28) బుధవారం అర్ధరాత్రి లేట్ నైట్ పార్టీలో పాల్గొన్నాడు. గురువారం తెల్లవారుజామున పార్టీలో వారు గొడవపడ్డారు. ఇద్దరు స్నేహితులు.. ఆకాంశ్‌ను కొట్టి, ఆయనపై కారును మూడుసార్లు పోనిచ్చారు. బీఎండబ్ల్యూ కారును ఆకాంశ్‌ను 50 మీటర్ల దూరం లాక్కెళ్లింది. రక్తపుమడుగులో పడిఉన్న ఆకాంశ్‌ను అక్కడే వదిలేసి నిందితులు పారిపోయారు. కాగా తీవ్రంగా గాయపడ్డ ఆకాంశ్‌ను చాలా ఆలస్యంగా గుర్తించారు. శుక్రవారం చండీగఢ్లోని ఆస్పత్రిలో తరలించగా, అప్పటికే ఆయన మరణించినట్టు వైద్యులు ప్రకటించారు. నిందితులను హర్మితాబ్ సింగ్ ఫరీద్, బలరాజ్ సింగ్ రంధావాలుగా గుర్తించారు. వీరిద్దరిపై హత్యకేసు నమోదు చేశామని, పరారీలో ఉన్నారని పోలీసులు చెప్పారు.

పోలీసుల విచారణ తీరుపై వీరభద్ర సింగ్ కుటుంబ సభ్యులు విమర్శించారు. హత్య జరిగిన 24 గంటలు దాటినా పోలీసులు నిందితులను అరెస్ట్ చేయలేదని వీరభద్ర సింగ్ కొడుకు విక్రమాదిత్య సింగ్ అన్నారు. వీరభద్ర సింగ్ మాట్లాడుతూ.. తాను పంజాబ్ గవర్నర్తో మాట్లాడానని, ఈ విషయంలో జోక్యం చేసుకోవాల్సిందిగా కోరానని, నిందితులు దేశం విడిచి పారిపోకుండా చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఉత్తరాఖండ్ ఎన్నికల ప్రచారంలో ఉన్న ఆయన తన పర్యటనను రద్దు చేసుకుని చండీగఢ్ వచ్చారు.

>
మరిన్ని వార్తలు