మీ తీరుతో మాకు అప్రతిష్ట

12 Oct, 2015 08:25 IST|Sakshi
మీ తీరుతో మాకు అప్రతిష్ట

సాక్షి, హైదరాబాద్: అటు కేంద్రంలో, ఇటు రాష్ట్రంలో మిత్రపక్షాలైన బీజేపీ, తెలుగుదేశం పార్టీల మధ్య అంతరం పెరుగుతోంది. రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలవల్ల తాము అప్రతిష్టపాలు కావలసి వస్తోందని బీజేపీ గుర్రుగా ఉంది. ఈ క్రమంలోనే బీజేపీ రాష్ట్ర శాఖ నేతలు టీడీపీ సర్కారు వ్యవహార శైలిని బహిరంగంగానే ఎండగడుతున్నారు. కేంద్రం మంజూరు చేస్తున్న నిధుల ఖర్చు విషయంలో సీఎం వ్యవహార శైలిని తప్పుపడుతున్నారు.

ప్రభుత్వాలు ఏర్పడిన కొత్తలో మెతక వైఖరి ప్రదర్శించినా ఇప్పుడు సమయానుకూలంగా స్పందించకపోతే అసలుకే మోసం వస్తుంద న్న నిజాన్ని తమ పార్టీ గ్రహించిందని బీజేపీ ఏపీశాఖ సీనియర్ నాయకుడొకరు చెప్పారు. రాష్ట్రస్థాయిలో బీజేపీ నేతల్ని కలుపుకుని వెళ్లకపోవడం, కేంద్రాన్ని వేలెత్తి చూపేలా టీడీపీ వ్యవహరించడం వంటి అంశాలపై తమ పార్టీలో అంతర్మథనం మొదలైందన్నారు.

పేరు రాకుండా అడ్డుపడుతున్న బాబు
కేంద్రం స్వయంగా ముందుకొచ్చి ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నా ఎక్కడా తమ పార్టీకి పేరుప్రఖ్యాతులు రాకుండా సీఎం చంద్రబాబు అడ్డుపడుతున్నారని బీజేపీ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు సోము వీర్రాజు, మహిళా మోర్చా నేత పురందేశ్వరి ఇటీవల టీడీపీ ప్రభుత్వ వ్యవహార శైలిని బహిరంగంగానే ప్రశ్నించారు. కొద్దిరోజులక్రితం రాష్ట్ర మంత్రి పి.మాణిక్యాలరావు, యువమోర్చా రాష్ట్ర అధ్యక్షుడు విష్ణువర్దన్‌రెడ్డి తదితరులు మీడియా సమావేశంలో టీడీపీ వైఫల్యాలను వేలెత్తి చూపారు.

‘‘కేంద్రం ఇచ్చిన నిధులను ఖర్చు చేయకపోగా కొన్నింటిని వేరే కార్యక్రమాలకు మళ్లిస్తున్నారు. రాష్ట్రంలో ప్రతిపక్షం నుంచి విమర్శలు ఎదురైనప్పుడల్లా చంద్రబాబు ఢిల్లీకి వస్తున్నారు. ఢిల్లీయే ఏమీ చేయడం లేదన్న భావన కల్పిస్తున్నారు. ఇది నిజం కాదు. పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా గుర్తించాక కేంద్రం ఇప్పటివరకు దాదా పు రూ.700 కోట్లు విడుదల చేసింది. ఆ ప్రాజెక్టుపై ఇప్పటివరకు ఒక్క రూపాయి పని కూడా చేయలేదు’’ అని రాష్ట్రానికి చెందిన బీజేపీ జాతీయ నాయకుడొకరు వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో మిత్రపక్షంగా ఉన్నప్పటికీ చిన్నపాటి నామినేటెడ్ పదవుల్లోనూ ప్రాధాన్యమివ్వకపోవడాన్ని కొంద రు బీజేపీ నేతలు ప్రస్తావించారు. పట్టిసీమ విషయంలో బీజేపీ రాష్ట్ర శాఖ అసంతృప్తి, అభ్యంతరాల్ని వ్యక్తం చేయడం తెలిసిందే.  

పార్టీని బలోపేతం చేద్దాం
అధికార టీడీపీ పట్ల బీజేపీ రాష్ట్ర నేతల వైఖరి క్రమంగా మారుతోంది. ఏపీలో బీజేపీని బలోపేతం చేసేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నట్లు పార్టీవర్గాల సమాచారం. కేంద్రం రాష్ట్రానికి అందజేసే ప్రతి రూపాయికి తగిన ప్రచారం రాబట్టుకోవాలని కమలం నేతలు యోచిస్తున్నారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా వద్ద కొందరు రాష్ట్ర నేతలు ఈ విషయం ప్రస్తావించినప్పుడు ఆయన అంగీకారం తెలిపినట్లు సమాచారం. రానున్న రోజుల్లో రాష్ట్రంలో కేంద్ర పథకాల అమలు తీరుపై ఎప్పటికప్పుడు సమీక్ష జరిపి ప్రజల ముందుంచాలని బీజేపీ నేతలు నిర్ణయించారు.

మరిన్ని వార్తలు