సంచలనం రేపుతోన్న విందు భేటీ

16 Jun, 2017 18:03 IST|Sakshi
సంచలనం రేపుతోన్న విందు భేటీ

- రాష్ట్రపతి భవన్‌కు ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌
- ప్రణబ్‌తో కలిసి లంచ్‌చేసిన భగవత్‌
- అనూహ్య పరిణామాంపై సర్వత్రా విస్మయం


న్యూఢిల్లీ:
రాష్ట్రపతి ఎన్నికల హడావిడి మొదలైన నాటి నుంచి ఎవరిపేరైతే ఎన్డీఏ అభ్యర్థిగా బలంగా వినిపిస్తోందో.. ఆ మోహన్‌ భగవత్‌ రాష్ట్రపతి భవన్‌కు రావడం దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ ఆహ్వానం మేరకే మోహన్‌ భగవత్‌ రాష్ట్రపతి భవన్‌కు వెళ్లినట్లు ఆర్‌ఎస్‌ఎస్‌ వర్గాలు వెల్లడించాయి. ప్రణబ్‌, భగవత్‌లు కలిసి మధ్యాహ్న భోజనం(లంచ్‌) చేశారు. ఇది మర్యాదపూర్వక భేటీ మాత్రమేనని రాష్ట్రపతి భవన్‌ వర్గాలు పేర్కొన్నాయి.

కరసేవకులకు శిక్షణ ఇచ్చే నిమిత్తం రుద్రపూర్‌(ఉత్తరాఖండ్‌)లో ఉన్న మోహన్‌ భగవత్‌కు గురువారమే రాష్ట్రపతి భవన్‌ నుంచి పిలుపు అందినట్లు తెలిసింది. ఈ మేరకు రుద్రపూర్‌నుంచి ఢిల్లీకి వచ్చిన భగవత్‌ నేరుగా రాష్ట్రపతి భవన్‌కు వెళ్లి ప్రణబ్‌ను కలుసుకున్నారు.

దీనర్థం ఏమిటి?
రాష్ట్రపతి రేసులో మోహన్‌ భగవత్‌ పేరు బలంగా వినిపిస్తున్న తరుణంలో ఆయన రాష్ట్రపతితో భేటీ కావడం వెనకున్న అర్థమేమిటనే చర్చ మొదలైంది. మత సంస్థకు అధినేతగానేకాక వివాదాస్పదుడిగానూ పేరుపొందిన మోహన్‌ భగవత్‌ అభ్యర్థిత్వాన్ని విపక్షాలు మూకుమ్మడిగా వ్యతిరేకిస్తున్నాయి. ‘మోహన్‌ భగవతే గనుక రాష్ట్రపతి అభ్యర్థయితే తల తెగిపడినా మద్దతివ్వం’  అని లాలూ ప్రసాద్‌ సహా కొన్ని పార్టీల కీలక నేతలు ప్రకటనలు చేశారు. దీంతో బీజేపీ ‘పైనుంచి నరుక్కు రావాల’ని భావిస్తున్నట్లు తెలిసింది. రాష్ట్రపతితో విందు ద్వారా.. అభ్యర్తి ఎవరనేది చెప్పకనే చెప్పినట్లు కొందరు భావిస్తున్నారు. అయితే ఈ ఎత్తుగడ ఏమేరకు ఫలిస్తుందో జులై 17 ఎన్నికల తర్వాతే తేలనుంది.
(రాష్ట్రపతి ఎన్నికలు; బీజేపీకి ఝలక్‌)

మరిన్ని వార్తలు