తెలంగాణ సాధనలో కేసీఆర్‌ పాత్ర ఒక్క శాతమే.. | Sakshi
Sakshi News home page

తెలంగాణ సాధనలో కేసీఆర్‌ పాత్ర ఒక్క శాతమే..

Published Wed, Sep 13 2023 2:47 AM

MP Komatireddy Venkat Reddy Comments On Minister KTR - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కాంగ్రెస్‌ పార్టీకి నూకలు చెల్లుతాయని తెలిసే తెలంగాణ ప్రకటించారని, సోనియాగాంధీ తెలంగాణ ఇచ్చారంటే భారతదేశానికి బ్రిటిష్‌ వారు స్వాతంత్య్రం ఇచ్చారని చెప్పినంత దరిద్రంగా ఉంటుందని రాష్ట్ర మంత్రి కేటీఆర్‌ చేసిన వ్యాఖ్యలపై భువనగిరి ఎంపీ, కాంగ్రెస్‌ స్టార్‌ క్యాంపెయినర్‌ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మండిపడ్డారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత 2014లో అసెంబ్లీలో  కేసీఆర్‌ ఏం మాట్లాడారో కేటీఆర్‌ తెలుసుకుని మాట్లాడాలని, పనికిమాలిన మాటలు మాట్లాడవద్దని హితవు పలికారు. సోనియా లేకపోతే తెలంగాణ వచ్చి ఉండేది కాదని, ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇది నిజమని నాడు కేసీఆర్‌ ఆన్‌ రికార్డు వ్యాఖ్యలు చేశారని గుర్తు చేశారు. మంగళవారం గాంధీభవన్‌లో ఎంపీ కోమటిరెడ్డి మీడియాతో మాట్లాడారు.

వైఎస్సార్‌ ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడే తెలంగాణ కావాలని..
‘మలిదశ తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించిందే కాంగ్రెస్‌ పార్టీ. వైఎస్‌ ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు నాతో సహా 41 మంది ఎమ్మెల్యేలం తెలంగాణ కావాలని అడిగినందుకే ప్రణబ్‌ముఖర్జీ కమిటీ వేశారు. అప్పుడు కేటీఆర్‌ రాజకీయాల్లో లేడు. అమెరికాలో ఉన్నాడు. ఆ తర్వాత కేసీఆర్‌కు చంద్రబాబు మంత్రిపదవి ఇవ్వలేదని తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించాడు. తెలంగాణ ఇచ్చిన సోనియాగాంధీని, కాంగ్రెస్‌ పార్టీని విమర్శించడం తగదు. ఇంకోసారి కాంగ్రెస్‌ పార్టీ జోలికి వస్తే ఊరుకోం.’ అని కోమటిరెడ్డి హెచ్చరించారు.

వాళ్లకు టికెట్లు క్యాన్సిల్‌ చేయండి
కట్టె పట్టుకుని తెలంగాణ ఉద్యమకారులను కొట్టిన దానం నాగేందర్, కేసీఆర్‌ను ఫుట్‌బాల్‌లా తంతానన్న తలసాని శ్రీనివాస్‌యాదవ్, పట్నం మహేందర్‌రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, మల్లారెడ్డి, పువ్వాడ అజయ్‌కుమార్, మాగంటి గోపీనాథ్, అరికెపూడి గాంధీ... ఇలా చెప్పుకుంటూ పోతే చిట్టా చాలా ఉందని, ఈ మంత్రులను ముందు కేబినెట్‌ నుంచి తొలగించి, తెలంగాణ ఉద్యమ ద్రోహులకు ఇచ్చిన టికెట్లను క్యాన్సిల్‌ చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు.

బానిసత్వ పార్టీ ఎవరిదో అందరికీ తెలుసునని, డిప్యూటీ స్పీకర్‌ పద్మాదేవేందర్‌రెడ్డి, మంత్రి మహమూద్‌అలీలు ప్రగతిభవన్‌ వరకు వస్తే 100 కిలోమీటర్ల స్పీడ్‌తో వెనక్కు పంపింది ఎవరని ప్రశ్నించారు. ప్రగతిభవన్‌ లోపలికి రానివ్వకపోతే ఏడ్చానని రాజేందర్‌ చెప్పారని గుర్తు చేశారు. వైఎస్‌ సీఎంగా ఉన్నప్పుడు సర్పంచ్‌ కూడా ఆయనను సులువుగా కలవగలిగేవారని చెప్పారు.

ఎన్నికల ఆలస్యంపై కేటీఆర్‌ మాట్లాడటం హాస్యాస్పదం
రాష్ట్రంలో ఎన్నికలు ఆలస్యమవుతాయని, ఫిబ్రవరి వరకు తీసుకెళ్తారని కేటీఆర్‌ చెప్పడం హాస్యాస్పద మని కోమటిరెడ్డి చెప్పారు. బీజేపీతో అమిత్‌షాతో భేటీ అయి కవితను జైలుకు పంపవద్దని ఒప్పందం కుదుర్చుకున్నారని, ఇప్పుడు ఆయన ఫిబ్రవరిలో ఎన్నికలు వస్తాయని చెప్పకపోతే తమకు తెలియదా? అని వ్యాఖ్యానించారు.  

Advertisement

తప్పక చదవండి

Advertisement