పార్టీలో అంతర్గత విభేదాలు వీడండి: శరద్ పవార్

6 Dec, 2013 17:45 IST|Sakshi

ముంబై: ఇటీవలి జిల్లా పరిషత్ ఎన్నికల ఫలితాలు ఎన్సీపీకి ఎంతమాత్రం మింగుడు పడడం లేదు. రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో ప్రతిష్ట దెబ్బతిందని ఆ పార్టీ అధిష్టానం గ్రహించింది. దీంతో మున్ముందు ఈ పరిస్థితి ఎదురుకాకుండా చేసేందుకుగాను ఆ పార్టీ అధ్యక్షుడు శరద్ పవార్ గురువారం సాయంత్రం నగరంలో ఓ సమావేశం ఏర్పాటుచేశారు. ఈ సమావేశానికి హాజరైన మంత్రులు, నాయకులకు ఆయన ఈ సందర్భంగా పలు సూచనలు చేశారు. అంతర్గత విభేదాలు, అలసత్వం విడిచి ఇప్పటినుంచి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని సూచించారు.

 

ఖాందేశ్, విదర్భ ప్రాంతాల్లో పార్టీ పరిస్థితి మెరుగుపడేందుకు  చొరవ తీసుకోవాలన్నారు. చెరకు రైతుల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేయాలన్నారు. ఈవిధంగా ముందుకుసాగితేనే వచ్చే లోక్‌సభ, శాసనసభ ఎన్నికల్లో ఫలితాలు పార్టీకి అనుకూలంగా వస్తాయని ఆయన హితబోధ చేశారు. గడచిన 14 సంవత్సరాల కాలంలో పార్టీ చేపట్టిన అభివృద్థి పనులను ప్రజల దృష్టికి తీసుకెళ్లాలన్నారు. ప్రజలు పార్టీకి దూరం కాకుండా జాగ్రత్తపడాలని సూచించారు. మీడియాతోపాటు ఇతర సంస్థలు నిర్వహించే ఎగ్జిట్ పోల్స్‌పై ఆధార పడొద్దని, అభివృద్ధి పనులే గెలిపిస్తాయని సూచించారు.

మరిన్ని వార్తలు