‘బీ కేటగిరీ’లో స్కామ్!

29 Aug, 2015 01:15 IST|Sakshi
‘బీ కేటగిరీ’లో స్కామ్!

సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రైవేటు మెడికల్, డెంటల్ కాలేజీ యాజమాన్యాలు బీ కేటగిరీ సీట్ల కేటాయింపులో భారీ కుంభకోణానికి తెరలేపాయి! ఈ సీట్లను ప్రత్యేక ప్రవేశ పరీక్షకు ముందే కోట్ల రూపాయలకు అమ్ముకున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నా పట్టించుకోని యాజమాన్యాలు ఆ సీట్లను ‘కొనుగోలు’ చేసిన వారికే కట్టబెట్టేందుకు వీలుగా ఎన్నారై కోటాలోకి మార్చుకునేందుకు కుట్రకు రంగం సిద్ధం చేశాయి!! కౌన్సిలింగ్‌లో ప్రతిభ ఆధారంగా ఎంబీబీఎస్ సీట్లు పొందిన విద్యార్థులను సైతం తప్పించేందుకు తెగించాయి.

ఏదైనా కారణంతో కాలేజీ యాజమాన్యం సీటు కోల్పోతే ఆ సీటును ఎన్నారై కోటాలోకి మార్చుకోవచ్చన్న ప్రభుత్వ ఉత్తర్వును అనుకూలంగా మలచుకునేందుకు యత్నిస్తున్నాయి. ఎక్కువ మంది మధ్య తరగతి విద్యార్థులే ఉన్నప్పటికీ వారి స్తోమతకు మించి ఎంబీబీఎస్‌కు మొదటి ఏడాది ఫీజు రూ. 9 లక్షలతోపాటు నాలుగేళ్ల బ్యాంకు గ్యారంటీ చూపాలని ఒత్తిడి తెస్తున్నాయి. పన్నురెండ్రోజుల క్రితం ప్రభుత్వం నాలుగేళ్ల బ్యాంకు గ్యారంటీని ఏడాదికి కుదిస్తూ జీవో జారీచేసినా అమలు చేయడానికి నిరాకరిస్తున్నాయి. ఈ నెలాఖరుకే గ్యారంటీ గడువు ముగుస్తుండటంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వ జీవో ఉన్నప్పటికీ విద్యార్థులు ఎంబీబీఎస్ సీటు కోల్పోయే ప్రమాదం ఏర్పడింది.
 
నాలుగేళ్ల బ్యాంకు గ్యారంటీ చూపింది కొందరే...
రాష్ట్రంలోని ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో బీ కేటగిరీ కింద ఉన్న 505 ఎంబీబీఎస్ సీట్లు, 350 బీడీఎస్ సీట్లకు ఇటీవల ప్రత్యేక కౌన్సిలింగ్ నిర్వహించగా అందులో ఎంబీబీఎస్ సీట్లన్నీ నిండిపోయాయి. కానీ బీడీఎస్‌లో మాత్రం 200కుపైగా సీట్లు మిగిలిపోయాయి. విద్యార్థులు సీటు సాధించినప్పటికీ బ్యాంకు గ్యారంటీ వారికి అడ్డుగా మారింది. ఈ నెలాఖరు నాటికి నాలుగేళ్ల బ్యాంకు గ్యారంటీ ఇస్తేనే సీటు ఉంటుందని లేకుంటే వదులు కోవాల్సిందేనని యాజమాన్యాలు తెగేసి చెబుతున్నాయి.

ప్రభుత్వం జారీచేసిన ‘ఏడాదికి బ్యాంకు గ్యారంటీ’ జీవోతో తమకు సంబంధం లేదని వాదిస్తున్నాయి. దీంతో 505 ఎంబీబీఎస్ సీట్లల్లో చేరిన విద్యార్థుల్లో శుక్రవారం నాటికి కేవలం 10 శాతం మంది విద్యార్థులు మాత్రమే నాలుగేళ్ల బ్యాంకు గ్యారంటీ చూపినట్లు తెలిసింది. యాజమాన్యాల నిబంధన వల్ల కనీసం 300 ఎంబీబీఎస్ సీట్లకు చెందిన విద్యార్థులు నాలుగేళ్ల బ్యాంకు చూపని పరిస్థితి ఏర్పడుతుందని అంటున్నారు.

వీటిని ఎన్నారై కోటా కింద మార్చుకోవాలన్న కుట్రలో ప్రైవేటు మెడికల్ యాజమాన్నాలు ఉన్నాయి. కానీ ఇంత జరుగుతున్నా ప్రభుత్వ వర్గాలు మాత్రం చోద్యం చూస్తున్నాయి. బ్యాంకు గ్యారంటీకి వచ్చే నెల 4 వరకు అవకాశం ఉంటుందని వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు చెబుతున్నా బహిరంగ ప్రకటన ఇవ్వడానికి నిరాకరిస్తున్నాయి.
 
సవరణ జీవో ఏకపక్షం
రాష్ట్ర ప్రభుత్వంపై ప్రైవేటు వైద్య కళాశాలల యాజమాన్యాలు హైకోర్టుకెక్కాయి. యాజమాన్య కోటా కింద ప్రవేశం పొందే తేదీ లోపు మొదటి ఏడాది ఫీజుతోపాటు మిగిలిన నాలుగేళ్ల కోర్సుకు బ్యాంకు గ్యారంటీ తీసుకునేందుకు తమకు అనుమతినిస్తూ జారీ చేసిన జీవోను సర్కారు సవరించడాన్ని సవాల్‌చేస్తూ శుక్రవారం హైకోర్టును ఆశ్రయించాయి. ప్రభుత్వ నిర్ణయం ఏకపక్షమని ఆరోపించాయి. తమ పిటిషన్‌ను అత్యవసరంగా లంచ్‌మోషన్ రూపంలో విచారించాలని కోరాయి. అయితే ఇందుకు హైకోర్టు నిరాకరించింది.

సాధారణ పద్దతిలోనే పిటిషన్ విచారణకు వచ్చినప్పుడు వాదనలు వింటామని స్పష్టం చేసింది. కాగా, సవరణ జీవో మేరకు ఓ ఏడాదికి బ్యాంకు గ్యారంటీ సమర్పించేందుకు తమకూ గడువునివ్వాలంటూ పలువురు విద్యార్థులు శుక్రవారం హైకోర్టును ఆశ్రయించగా న్యాయస్థానం వారికి వారం గడువునిచ్చింది.

Read latest Top-news News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా