ఆశకు పోతే నెత్తిన గుడ్డే..

13 Apr, 2016 04:33 IST|Sakshi
ఆశకు పోతే నెత్తిన గుడ్డే..

ఆన్‌లైన్ వ్యాపారం ఇప్పుడు జోరందుకుంటోంది. సరి కొత్త ఉత్పత్తులు మొదలుకుని సెకండ్ హ్యాండ్ వస్తువులు అమ్మే సైట్లు కూడా కోకొల్లలుగా ఉన్నాయి. ఆన్‌లైన్‌లో సెకండ్ హ్యాండ్ వస్తువులు, ఉపకరణాల ప్రకటనలు ఆకర్షిస్తుంటాయి. ఎంతో ఖరీదైనవి సగం ధరకే అనే ప్రకటనలకైతే వినియోగదారులు ఇట్టే బుట్టలో పడిపోతుంటారు. అప్రమత్తంగా లేకపోతే తక్కువ ధరకే కొన్న ఆనందం కొన్ని రోజుల్లోనే ఆవిరైపోవచ్చు. కొత్త చికాకులూ చుట్టుముట్టొచ్చు.
 
* సెకండ్ హ్యాండ్ ఉపకరణాల కొనుగోలుతో చికాకు
* దొంగలించిన ఫోన్లను ఆన్‌లైన్‌లో విక్రయం
* జాగ్రత్తలు తీసుకోకుంటే జేబుకు చిల్లే

చిత్తూరు(గిరింపేట): మొదటి సన్నివేశం: చిత్తూరులోని క ట్టమంచికి చెందిన అనిల్ అనే యువకుడు ఆన్‌లైన్‌లో ఈ కామర్స్ వెబ్‌సైట్‌లో ఓ స్మార్ట్ ఫోన్ ప్రక టన చూసి ఆకర్షితుడయ్యాడు. ఆ మోడల్ వాస్తవ ధర సుమారు రూ. 40 వేలు. అయితే సగం ధ రకే ఆ ఫోన్‌ను అమ్మకానికి పెట్టడంతో ఏ మాత్రం అనుమానం లేకుండా ప్రకటన ఇచ్చిన వ్యక్తి నుంచి ఆ ఫోన్ కొనుగోలు చేశాడు. ఆ ఫోన్ కు బిల్లు ఇవ్వమని అడిగాడు. ఎక్కడోపోయిందని తిరుపతి వాసిగా చెప్పుకున్న ఆ ప్రకటనదారుడు పేర్కొనడంతో నిజమేనని నమ్మాడు. కానీ, తర్వాత కొన్ని రోజులకు ఆ ఫోన్ అతడి పెద్ద షాకే ఇచ్చింది.
 
రెండో సన్నివేశం:
కొత్తగా కొన్న సెకండ్ హ్యాండ్ ఫోన్‌లో సిమ్‌కార్డు వేసి రెండు రోజుల పాటు వినియోగించాడు. ఆ తర్వాత మూడో రోజు వచ్చిన ఓ ఫోన్ కాల్ అతడికి వణుకు, జ్వరం తెప్పించింది. అది దొంగలించిన ఫోన్ అని, దానిని మర్యాదగా అప్పగించకపోతే కేసు తప్పదని తిరుపతి పోలీసుస్టేషన్ నుంచి ఫోన్ రావడంతో హడలిపోయాడు. వెంటనే తనకు స్మార్ట్ ఫోన్ అమ్మిన వ్యక్తికి కాల్ చేశాడు. కానీ ఆ నంబర్ స్విచ్ఛాఫ్‌లో ఉందని వాయిస్ వినిపించింది. ఆన్‌లైన్‌లో తాను చూసిన ప్రకటన కోసం వె తికాడు. కానీ అక్కడ ఆ ప్రకటన లేదు.

ఇలా షాక్ మీద షాక్ తగలడంతో చేసేదేమీ లేక తాను ముచ్చట పడి కొన్న సెకండ్ హ్యాండ్ స్మార్ట్ ఫోన్‌ను పోలీసులకు అప్పగించాడు. ప్రకటనదారుడి సెల్ నంబర్ ఆధారంగా అతడి వివరాలు కనుగొనేందుకు యత్నించినా అదీనూ తప్పుడు నంబర్ అని పోలీసుల విచారణలో తేలింది. ఇది ఒక్క అనిల్‌కు ఎదురైన సమస్యే కాదు. జిల్లాలో ఇలా మోసపోతున్న వారు చాలా మందే వున్నారు. ఆన్‌లైన్‌లోని కొన్నిసైట్లలో ప్రకటనల ద్వారా విక్రయిస్తున్న సెకండ్ హ్యాండ్ ఫోన్లలో ఎక్కువగా దొంగలించినవే కావడంతో కొన్నవారు ఇలాంటి చేదు అనుభవాలను చవిచూడాల్సి వస్తోంది.

సెల్‌ఫోన్లు చోరీకి గురైతే పోలీసులు తమ వద్ద గల సాఫ్ట్‌వేర్ ద్వారా (ఇంటర్‌నేషనల్ మొబైల్ ఎక్విప్‌మెంట్ ఐడె ంటిటీ(ఐఎంఈఐ)నంబరు ద్వారా ఫోన్ ఏ ప్రాంతంలో వుందో ట్రాక్ చేసి గుర్తిస్తారు. కొట్టేసిన ఫోన్‌లోని సిమ్‌కార్డు తీసేసి విక్రయించినా ఐఎంఈఐ నంబరు వారిని పట్టిస్తోంది. అటువంటి ఫోన్లను కొనుగోలు చేసిన వారు కొత్త సిమ్‌ను అందులో వేసిన వెంటనే పోలీసుల ట్రాకింగ్‌కు చిక్కుతోంది. ఈ  క్రమంలో తక్కువ ధరకు ఫోన్ లభించిదంటూ బిల్లులేని ఫోన్లను కొంటే భాదితుల జాబితాలోకి చేరాల్సిందే.
 
ఐఎంఈఐ ప్రత్యేకత
* ప్రతి ఫోన్‌కు ఐఎంఈఐ సంఖ్య ఆధార్ సంఖ్యలాగా విశిష్టమైన ది. ఒక ఫోన్‌కున్న సంఖ్య మరొక ఫోన్‌కు ఉండదు.
* ఒక వేళ ఫోన్‌ను దొంగలు అపహరించి సిమ్‌కార్డును దానిలోంచి తీసివేసినా పోలీసులు ఆ సంఖ్య ఆధారంగా దొంగలను పట్టుకుంటారు. ఏ పరిధిలో ఫోన్‌ను వినియోగిస్తున్నారనే విషయాన్ని గమనించి పట్టుకునే అవకాశం వుంది.
* స్మార్ట్ ఫోన్లలో యాంటీ థెఫ్ట్ సాఫ్ట్‌వేర్‌ను అప్‌లోడ్ చేసుకుంటే తమ ఖరీదైన ఫోన్లను కాపాడుకోవచ్చు.
 
సాధరణంగా జరిగే పొరపాట్లు
* షాపింగ్‌చేసే సమయంలో ఏమరుపాటుతో సెల్‌ఫోన్లను పక్కనపెట్టి మరచిపోతుంటారు.
* బస్సులో వెళ్లేటప్పుడు నిద్రిస్తున్న సమయంలో దొంగలు తమ పని కానిచ్చేయడమో లేదా జేబు నుంచి పడిపోవడం, తమ స్టాపింగ్ రాగానే సెల్ ఉన్నదీ లేనిదీ గమనించకనే హడావుడిగా దిగి వెళుతుంటారు.
* రైలు ప్రయాణాలు చేయాల్సి వచ్చినప్పుడు రిజర్వేషన్ బుకింగ్ కౌంటర్ల వద్ద దరఖాస్తు ఫారాలను పూర్తిచేయడంలో నిమగ్నమై సెల్‌ఫోన్‌ను పక్కన పెట్టి అలాగే వ దలి వెళుతుంటారు.
* రైల్వేస్టేషన్లలో సెల్‌ఫోన్లను చార్జింగ్ పెట్టి దానిని గమనించకుండా వుండడంతో సమయం చూసి వాటి ని కొట్టేస్తున్నారు.
* విద్యార్థులు పరీక్ష లకు హాజరయ్యే సమయంలో ఫోన్లను బ్యాగ్‌లలో పెట్టి పరీక్షలకు వెళుతుంటారు. ఆ సమయంలో అవి దొంగతనానికి గురవుతుంటాయి.

మరిన్ని వార్తలు