మెత్తబడిన కేంద్రం. ఎంపీకి గ్రీన్ సిగ్నల్

27 Mar, 2017 20:26 IST|Sakshi
మెత్తబడిన కేంద్రం. ఎంపీకి గ్రీన్ సిగ్నల్

న్యూఢిల్లీ: ఎయిరిండియా అధికారిపై దాడికి పాల్పడిన శివసేన ఎంపీ రవీంద్ర గైక్వాడ్ విషయంలో కేంద్ర ప్రభుత్వం మెత్తపడింది. అన్ని విమానాల్లో గైక్వాడ్ ప్రయాణించేందుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

ఢిల్లీ విమానాశ్రయంలో సీటు విషయంలో గొడవపడిన గైక్వాడ్.. సుకుమార్‌ అనే ఎయిరిండియా ఉద్యోగిని చెప్పుతో కొట్టడం దేశ వ్యాప్తంగా దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో ఎంపీపై ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. ఎయిరిండియా సహా ప్రధాన విమాన సంస్థలలో గైక్వాడ్ ప్రయాణించకుండా నిషేధం విధించారు. ఢిల్లీ నుంచి పుణెకు తిరిగి వెళ్లేందుకు గైక్వాడ్ రిజర్వ్ చేసుకున్న టికెట్‌ను కూడా రద్దు చేశారు. దీంతో ఆయన రైలులో ముంబై వెళ్లాల్సి వచ్చింది.

ఈ నేపథ్యంలో సోమవారం శివసేన ఎంపీలు.. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతి రాజు, లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్‌లను కలసి గైక్వాడ్‌పై నిషేధం తొలగించాలని కోరారు. విమానాల్లో ప్రయాణించకుండా ఎంపీపై నిషేధం విధించడం ప్రాథమిక హక్కులకు వ్యతిరేకమని సమాజ్‌వాదీ పార్టీ సభలో పేర్కొంది. ఎంపీ తప్పు చేసినట్టు తేలితే ఆయనపై చర్యలు తీసుకోవాలని, విమానాల్లో ప్రయాణించకుండా ఆపేలా చట్టం లేదని కేంద్ర న్యాయ శాఖ సహాయ మంత్రి పీపీ చౌదరి అన్నారు. అన్ని విషయాలను పరిశీలించిన తర్వాత విమానాల్లో ప్రయాణించేందుకు గైక్వాడ్‌కు అనుమతి ఇచ్చేందుకు కేంద్ర అంగీకరించింది.
 

మరిన్ని వార్తలు