అరవనందుకు రేప్‌ కేసు కొట్టివేత

27 Mar, 2017 19:08 IST|Sakshi
అరవనందుకు రేప్‌ కేసు కొట్టివేత
రోమ్‌: ఉత్తర ఇటలీలోని టురిన్‌ నగరంలో రేప్‌నకు గురైన ఓ బాధితురాలు ‘రక్షించండి, రక్షించండి’ అంటూ అరవనందుకు, రేప్‌ చేస్తుంటే బాధతో ఏడవనందుకు 46 ఏళ్ల నిందితుడిని కోర్టు నిర్దోషిగా ప్రకటించి ఇటీవల విడుదల చేసింది. సంచలనం సృష్టించిన ఈ కేసులో ఆస్పత్రి పడక మీదున్న బాధితురాలు తనకు తెలిసిన వ్యక్తే తనను రేప్‌ చేస్తుంటే  బాధతో ఎందుకు ఏడవలేదని, రక్షించడంటూ ఎందుకు ఇతరుల సహాయాన్ని అర్థించలేదంటూ జడ్జి డైమాంటే మునిస్సీ పదే పదే బాధితురాలిని, ఆమె న్యాయవాదులను ప్రశ్నించారు. 
 
ఆ సమయంతో బాధితురాలు బలహీనంగా ఉన్నారని, తెలిసిన వ్యక్తే తనపై అత్యాచారం చేస్తుంటే దిగ్భ్రాంతితో నోటమాట రాకుండా మ్రాన్పడి పోయారని బాధితురాలి న్యాయవాదులు, బాధితురాలు వాదించినా జడ్జి విశ్వసించలేదు. బాధితురాలికి తాను మాజీ కొలీగ్‌ను అవడం వల్ల పలకరించేందుకు ఆస్పత్రికి వెళ్లానని, పరస్పర అంగీకారంతోనే తాను సెక్స్‌లో పాల్గొన్నానని, అందుకే ఆమె అరుపులు, కేకలు పెట్టలేదంటూ నిందితుడు చేసిన వాదననే జడ్జి నమ్మారు. అంతకుముందు కూడా బాధితురాలితో తనకు లైంగిక సంబంధాలున్నాయని ఈ సందర్భంగా నిందితుడు కోర్టుకు తెలిపారు. 
 
పరస్పర అంగీకారంతో జరిగిన సెక్స్‌ రేప్‌ కిందకు రాదన్న కారణంగా జడ్జీ నిందితుడిని నిర్దోషిగా ప్రకటించారు. దీనిపై దేశవ్యాప్తంగా మహిళా సంఘాలు గొడవ చేయడం, ఈ కేసు ఇటలీ పార్లమెంట్‌లో ప్రస్తావనకు రావడంతో ఇప్పుడు రేప్‌ కేసుపై పునర్‌ దర్యాప్తు కోసం ఇటలీ న్యాయశాఖ మంత్రి ఆండ్రియో ఓర్లాండో ఆదేశించారు.
Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు