భారీ నష్టాల్లో ముగిసిన మార్కెట్లు

12 Sep, 2016 16:43 IST|Sakshi

ముంబై: అంతర్జాతీయ మార్కెట్ల సంకేతాలతో దేశీయ స్టాక్ మార్కెట్లు భారీగా పతనమయ్యాయి. ఆరంభంలోనే మదుపర్లు షాకిచ్చిన మార్కెట్లు మిడ్ సెషన్లో కొద్దిగా కోలుకున్నా చివరికి భారీ నష్టాల్లోనే ముగిశాయి. 443 పాయింట్ల నష్టంతో సెన్సెక్స్ 28,353 వద్ద, నిఫ్టీ 151 పాయింట్ల నష్టంతో  8,715, వద్ద క్లోజ్ అయ్యాయి.   బ్రెగ్జిట్  సంక్షోభం తర్వాత ఇదే భారీ పతనమని మార్కెట్ల  వర్గాలు  అంచనావేశాయి. ప్రధానంగా అన్ని రంగాల సూచీలు నష్టాల బాట పడ్డాయి. మిడ్‌ సెషన్‌ నుంచీ పెరిగిన అమ్మకాలతో బ్యాంక్ సెక్టార్ భారీగా పతనం కాగా, ఐటీ సెక్టార్ లాభాలను ఆర్జించింది..  ఫెడ్ వడ్డీ రేట్లను పెంచనుందనే అంచనాలు కూడా మార్కెట్లకు ప్రతికూలంగా మారాయి. దీంతో రియల్టీ, పీఎస్‌యూ బ్యాంక్ సూచీల్లో  అమ్మకాలు వెల్లువెత్తాయి. ఆటో, మీడియా, ఎఫ్‌ఎంసీజీ, ఫార్మా రంగాలు కూడా ఇదే బాట పట్టాయి.  హిందాల్కో బీవోబీ, అదానీ పోర్ట్స్‌, టాటా స్టీల్‌, యస్‌బ్యాంక్‌,  అంబుజా, టాటా పవర్‌, ఏసీసీ, స్టేట్‌బ్యాంక్‌, భెల్‌ నష్టపోగా, ఇన్ఫోసిస్‌, టెక్‌మహీంద్రా, హెచ్‌సీఎల్‌ టెక్‌, ఆర్‌ఐఎల్‌, టీసీఎస్‌  లాభపడ్డాయి.  అమెరికా మందగమనం, బ్రెక్సిట్‌ వంటి అంశాల కారణంగా ఇటీవల నీరసించిన ఈ రంగంలో ట్రేడర్లు షార్ట్‌ కవరింగ్‌కు దిగడం దీనికి కారణమని నిపుణులు పేర్కొన్నారు.  మరోవైపు బక్రీద్‌ సందర్భంగా మంగళవారం మార్కెట్లకు సెలవు.

అటు డాలర్ తో పోలిస్తే రూపాయి మరింత నేల చూపులు  చూస్తోంది. 22 పైసల భారీ పతనంతో 66.94 దగ్గర ఉంది. ఎంసీఎక్స్ మార్కెట్ లో పది గ్రా. ల పసిడి  రూ.102 నష్టంతో రూ. 31,115 వద్ద ఉంది.
 

మరిన్ని వార్తలు