నేటితో ముగియనున్న ‘గూప్‌–2’ గడువు

15 Dec, 2016 12:47 IST|Sakshi
నేటితో ముగియనున్న ‘గూప్‌–2’ గడువు

- ఇప్పటికే ఆరు లక్షలకు చేరిన దరఖాస్తులు
సాక్షి, హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ గతనెలలో విడుదల చేసిన గ్రూప్‌–2 నోటిఫికేషన్‌కు సంబంధించి బుధవారం సాయంత్రం వరకు దాదాపు ఆరు లక్షలవరకు దరఖాస్తులు అందాయి. ఈ పోస్టులకు ఆన్‌లైన్‌ దరఖాస్తు గడువు గురువారం అర్ధరాత్రితో ముగియనుంది. ఈ సంఖ్య మరికొంతమేర పెరుగుతుందని ఏపీపీఎస్సీ అధికారవర్గాలు పేర్కొంటున్నాయి. గ్రూప్‌–2 కింద 442 ఎగ్జిక్యూటివ్‌ పోస్టులు, 540 నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ పోస్టుల భర్తీకి గతనెల 8న నోటిఫికేషన్‌ వెలువరించి అదేనెల 11వ తేదీనుంచి ఆన్‌లైన్‌ దరఖాస్తుల స్వీకరణను కమిషన్‌ చేపట్టింది.

డిసెంబర్‌ 10వ తేదీ వరకు ముందు గడువు విధించింది. అయితే కమిషన్‌ వెబ్‌సైట్లో అనేక సాంకేతిక లోపాలు తలెత్తడంతో సాంకేతికంగా మార్పులు చేసినా ఫలితం దక్కలేదు. దీంతో గడువును మరో అయిదు రోజుల పాటు పెంచి ఈనెల 15వ తేదీని తుది గడువుగా చేసింది. కమిషన్‌ అంచనా కన్నా తక్కువగా  ఇప్పటివరకు ఆరు లక్షల లోపే దరఖాస్తులు అందాయి. దీంతో గడువును పెంచే అంశాన్ని పరిశీలిస్తామని ఆ వర్గాలు వివరించాయి.

ఫిబ్రవరి 26న స్క్రీనింగ్‌ టెస్టు: గ్రూప్‌–2 స్క్రీనింగ్‌ టెస్టు 2017 ఫిబ్రవరి 26న నిర్వహించే అవకాశముంది. నోటిఫికేషన్లో ఇచ్చిన షెడ్యూల్‌ ప్రకారం ఆ రోజు ఉదయం ఈ స్క్రీనింగ్‌ టెస్టు నిర్వహిస్తారు. ఆ టెస్టులో అర్హత సాధించిన వారిలో 1:50 చొప్పున 982 పోస్టులకు కటాఫ్‌ నిర్ణయించి 49,100 మందికి పైగా అభ్యర్థులను మెయిన్స్‌కు ఎంపికచేస్తారు. క్యారీఫార్వర్డ్‌ కింద కొత్తగా వచ్చి చేరే పోస్టుల సంఖ్యను అనుసరించి ఈ అభ్యర్థుల జాబితా మరింత పెరుగుతుంది. వీరికి మే 20, 21వ తేదీల్లో మెయిన్స్‌ను నిర్వహించనున్నారు. దరఖాస్తుల గడువు పెంచినందున ఈ షెడ్యూల్‌లో స్వల్ప మార్పులు చేర్పులకు అవకాశం ఉందని తెలుస్తోంది.

మరిన్ని వార్తలు