త్వరలో అన్న సంజీవని క్యాంటీన్లు

8 Sep, 2015 02:14 IST|Sakshi
త్వరలో అన్న సంజీవని క్యాంటీన్లు

సాక్షి, విజయవాడ బ్యూరో: రాష్ట్రంలో అన్న సంజీవని ఫుడ్ క్యాంటీన్లు త్వరలో ప్రారంభించనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు  చెప్పారు. ప్రతి ఇంట్లోనూ ఒక ఈ-మహిళను అక్షరాస్యులిగా మార్చాలని, 2019 నాటికి డ్వాక్రా మహిళల్లో నూరు శాతం అక్షరాస్యతను తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. తన క్యాంపు కార్యాలయంలో  గ్రామీణాభివృద్ధి శాఖపై జరిపిన సమీక్షలో మాట్లాడుతూ  రాష్ట్రంలోని ప్రతి మహిళా నెలసరి ఆదాయం రూ.10 వేలకు పెరగాలన్నారు.

అక్టోబర్ 2 నుంచి మహిళా సాధికార యాత్రలు చేపట్టాలన్నారు. వారికి శిక్షణ ఇచ్చి వారు బ్యాంకింగ్ కరస్పాండెంట్లుగా మారేలా చూడాలన్నారు.
 
పర్యాటక కేంద్రంగా లంబసింగి..
రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి ప్రణాళికాబద్ధం గా ముందుకెళ్లాలని క్రీడలు, సాంస్కృతి శాఖ సమీక్షలో అధికారులను చంద్రబాబు ఆదేశించారు. లంబ సింగిని ప్రత్యేక అంతర్జాతీయ కేంద్రంగా తీర్చిదిద్దాలని, అరకులో ప్రభుత్వ ఆర్చరీ అకాడమీలను ఏర్పాటు చేయాలని సూచించారు. తిరుపతి, చిత్తూరు, కర్నూలు, విజయవాడ, కాకినాడ, విశాఖలను అర్బన్ స్పోర్ట్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కింద ఎంపిక చేసి  ప్రతిపాదనలు పంపాలన్నారు.
 
సీఎంను కలిసిన బ్రిటానియా ఎండీ
చిత్తూరు జిల్లాలో ఆగ్రో ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేయడానికి బ్రిటానియా ఇండస్ట్రీస్ లిమిటెడ్ కంపెనీ సానుకూలత వ్యక్తం చేసింది. సోమవారం క్యాంపు కార్యాలయంలో సీఎం చంద్రబాబును కలిసిన కంపెనీ ఎండీ వరుణ్ బెర్రీ.. యూనిట్ ఏర్పాటుకు అవకాశాలపై చర్చించారు. రూ.125 కోట్లతో ఏర్పాటుచేయనున్న యూనిట్ తొలి దశ నిర్మాణాన్ని వచ్చే ఏడాది చివరిలోగా ప్రారంభిస్తామని ఆయన సీఎంకు చెప్పినట్లు కార్యాలయం పేర్కొంది.
 
20న  సింగపూర్‌కు పయనం
సాక్షి, హైదరాబాద్: కొత్త రాజధాని అమరావతి మాస్టర్ డెవలపర్‌గా స్విస్ చాలెంజ్ విధానంలో ఎంపిక చేయనున్న సింగపూర్‌కు చెందిన అసెండాస్ కంపెనీ మేనేజింగ్ డెరైక్టర్‌తోపాటు సింగపూర్ మంత్రి ఈశ్వరన్ తదితరులతో చర్చించేందుకు సీఎం చంద్రబాబు, మంత్రుల, అధికారుల బృం దం ఈ నెల 20వ తేదీ రాత్రి బయలుదేరి వెళ్లనుంది. ఈ బృందం నాలుగు రోజులపాటు అక్కడ పర్యటించనుంది.

దీనిపై సీఆర్‌డీఏ అధికారులు చర్చిస్తున్నట్లు సమాచారం. దీనికి గాను అసెండాస్ కంపెనీ ఏం కోరుకుంటోందనే అంశంపై సీఆర్‌డీఏ ఇటీవలే ఒక నోట్‌ను తయారు చేసింది. మాస్టర్ డెవలపర్‌గా ఉండేందుకు అది కొన్ని షరతులను విధించింది. వీటిపై నేరుగా సీఎం  బృందం చర్చించనుంది. రాజధానిలో మౌలిక వసతుల కల్పనకు వెచ్చించిన ఖర్చుపోగా మిగిలిన మొత్తాన్ని మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం, అసెండాస్ పంచుకోవాలని కంపెనీ షరతు విధించింది.

మరిన్ని వార్తలు