'ఆ ఇద్దరి'పై ఐఓఏకి కేంద్రం స్ట్రాంగ్‌ వార్నింగ్‌

28 Dec, 2016 19:05 IST|Sakshi
సురేశ్‌ కల్మాడి, అభయ్‌సింగ్‌ చౌతాలా

న్యూఢిల్లీ: సురేశ్‌ కల్మాడీ, అభయ్‌ సింగ్‌ చౌతాలాల వ్యవహారంలో ఇండియన్‌ ఒలింపిక్‌ అసోసియేషన్‌(ఐఓఏ)పై కేంద్ర ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. కుంభకోణాలకు పాల్పడ్డారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న కల్మాడి, చౌతాలాలకు ప్రతిష్టాత్మక సంస్థలో చోటు కల్పించరాదని, తక్షణమే వారు రాజీనామా చేయడమో, లేదంటే తొలగించడమో జరగాలని ఒలింపిక్‌ సంఘానికి(ఐఓఏకి) కేంద్ర ప్రభుత్వం సూచించింది. ఈ మేరకు బుధవారం షోకాజ్‌ నోటీసులు జారీచేసింది. ఒకవేళ మాట వినకుంటే ఐఓఏకు కేంద్ర ప్రభుత్వ గుర్తింపును రద్దుచేస్తామని హెచ్చరించింది.

క్రీడల మంత్రి విజయ్‌ గోయల్‌ సైతం ఈ వ్యవహారంపై స్పందిస్తూ క్రీడారంగంలో పారదర్శకత, జవాబుదారీతనం అత్యావశ్యకాలని, వాటికి విరుద్ధంగా ఆ ఇద్దరి(కల్మాడీ, చౌతాల) ఎంపిక జరగడం గర్హనీయమని వ్యాఖ్యానించారు. మంగళవారం చెన్నైలో జరిగిన ఒలింపిక్‌ సంఘం సర్వసభ్య సమావేశంలో కల్మాడీ, చౌతాలలను జీవితకాల అధ్యక్షులుగా ఎన్నుకోవడంపై పెద్ద ఎత్తున విమర్శలు చెలరేగిన సంగతి తెలిసిందే.

ఒలింపిక్‌ సంఘానికి కేంద్రం షోకాజ్‌ నోటీసు నేపథ్యంలో సురేశ్‌ కల్మాడి కాస్త వెనక్కి తగ్గినట్లు తెలిసింది. 'జీవితకాల అధ్యక్ష' పదవి చేపట్టేందుకు కల్మాడీ సుముఖంగా లేరని పలు జాతీయ చానెళ్లు వార్తలు ప్రసారం చేశాయి. అయితే కల్మాడీగానీ, చౌతాలాగానీ ఈ విషయాన్ని అధికారికంగా ధృవీకరించలేదు. కల్మాడీ, చౌతాలాల నియామకానికి సంబంధించి తాము ఎవ్వరి సూచనను పాటించాల్సిన అవసరం లేదని భారత ఒలింపిక్‌ సంఘం మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొంది. అయితే బుధవారం నాటి షోకాజ్‌ నోటీసుపై ఆ సంస్థ స్పందన వెలువడాల్సిఉంది. (చదవండి:  భారత ఒలింపిక్‌ సంఘం సంచలన ప్రకటన)

మరిన్ని వార్తలు