మళ్లీ రాహుల్‌ యూటర్న్‌.. ఆరెస్సెస్‌పై కామెంట్స్‌!

25 Aug, 2016 16:37 IST|Sakshi
మళ్లీ రాహుల్‌ యూటర్న్‌.. ఆరెస్సెస్‌పై కామెంట్స్‌!

మహాత్మాగాంధీ హత్యకు ఆరెస్సెస్‌ కారణమన్న రాహుల్‌గాంధీ వ్యాఖ్యల వివాదం ఇప్పట్లో సద్దుమణిగేలా కనిపించడం లేదు. గాంధీజీ హత్యకు ఆరెస్సెస్‌ను ఒక సంస్థగా బాధ్యుణ్ణి చేయలేమని రాహుల్‌ బుధవారం సుప్రీంకోర్టుకు చెప్పిన సంగతి తెలిసిందే. దీంతో రాహుల్‌ యూటర్న్‌ తీసుకొన్నారని విమర్శలు వస్తుండగా.. ఈ వివాదంపై ఆయన మళ్లీ స్పందించారు. ఆరెస్సెస్‌పై తాను అన్న ప్రతి మాటకు కట్టుబడి ఉన్నానంటూ మరోసారి ఆయన యూటర్న్‌ తీసుకున్నారు.

'ఆరెస్సెస్‌ విభజిత, విద్వేషపూరిత అజెండాపై పోరాటాన్ని ఆపే ప్రసక్తే లేదు. నేను అన్న ప్రతి మాటకు కట్టుబడి ఉన్నాను' అని రాహుల్‌ ట్విట్టర్‌లో పేర్కొన్నారు.    

మహాత్మాగాంధీ హత్యకు ఆరెస్సెస్సే కారణమంటూ 2014 సార్వత్రిక ఎన్నికల సందర్భంగా మహారాష్ట్రలో కాంగ్రెస్‌ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ పేర్కొన్నట్టు కథనాలు వచ్చాయి. ఆయన వ్యాఖ్యలపై ఆరెస్సెస్ కార్యకర్త ఒకరు పరువునష్టం దావా వేశారు. బుధవారం రాహుల్‌ తరఫు న్యాయవాది సుప్రీంకోర్టులో వాదనలు వినిపిస్తూ.. మహాత్మాగాంధీ హత్యకు కారణమంటూ ఆరెస్సెస్‌ను ఒక సంస్థగా రాహుల్‌ నిందించలేదని, కానీ, దానితో అనుబంధమున్న వ్యక్తులే గాంధీజీ హత్యవెనుక ఉన్నారని పేర్కొన్నారని తెలిపారు. దీంతో తన వ్యాఖ్యలపై రాహుల్‌ వెనుకకు తగ్గినట్టు విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఆయన మరోసారి స్పందిస్తూ తన వ్యాఖ్యలకు కట్టుబడ్డానని స్పష్టంచేశారు.

మరిన్ని వార్తలు