రూపాయి స్థిరపడేదాకా కఠిన విధానమే

2 Aug, 2013 01:05 IST|Sakshi
రూపాయి స్థిరపడేదాకా కఠిన విధానమే

చెన్నై:  రూపాయి విలువను పెంచడానికి అనుసరిస్తున్న కఠిన లిక్విడిటీ (ద్రవ్య) విధానం ఉపసంహరణకు నిర్దిష్ట కాల పరిమితిని చెప్పలేమని రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) గవర్నర్ దువ్వూరి సుబ్బారావు పేర్కొన్నారు. విదేశీ మారక ద్రవ్య (ఫారెక్స్) మార్కెట్‌లో స్థిరత్వం నెలకొనేంతవరకూ కఠిన ద్రవ్య విధానం కొనసాగుతుందని సైతం స్పష్టం చేశారు. దువ్వూరి గురువారం ఇక్కడ ఆర్ వెంక ట్రామన్ 5వ స్మారకోపన్యాసం చేశారు. పలువురు భావిస్తున్న తరహాలోనే కఠిన ద్రవ్య విధానాన్ని సాధ్యమైనంత త్వరగా ఉపసంహరించాలని ఆర్‌బీఐ కూడా భావిస్తోందని ఈ సందర్భంగా అన్నారు. అయితే రూపాయి విలువలో ఒడిదుడుకులు కొనసాగినంతకాలం కఠిన చర్యలు కొనసాగించక తప్పదని స్పష్టం చేశారు. ఈ పరిస్థితుల్లో ఇందుకు సంబంధించి నిర్దిష్ట కాల పరిమితిని తాను వెల్లడించలేనని అన్నారు.
 
 విమర్శలపై ఇలా...
 కఠిన ద్రవ్య, పరపతి విధానాన్ని అనుసరిస్తూ, వృద్ధిపై ఆర్‌బీఐ తగిన దృష్టి పెట్టడం లేదన్న విమర్శలపై దువ్వూరి ఈ సందర్భంగా మాట్లాడారు. వృద్ధి పక్షంగా స్వల్ప కాలంలో కొంత త్యాగం లేనిదే ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేయలేమని అన్నారు. కోట్లాది ప్రజలు ధరల పెరుగుదలతో ఇబ్బందులు పడుతున్న పరిస్థితుల్లో దీనిని వృద్ధి-ద్రవ్యోల్బణం మధ్య ఒత్తిడిగా చూడడం సరికాదని అన్నారు. ద్రవ్యోల్బణం నియంత్రణ, వృద్ధికి ఊతం, ఆర్థిక స్థిరత్వం తమ ముందు ఉన్న  ప్రాధాన్యతని అన్నారు. అయితే అదే సమయంలో తీవ్రస్థాయిలో ధరల పెరుగుదలతో అష్టకష్టాలు పడుతున్న పేద ప్రజల మూగ గొంతు వినడమూ ఆర్‌బీఐ బాధ్యతని స్పష్టం చేశారు.  
 
 మొండి బకాయిల గురించి...
 ప్రభుత్వరంగ బ్యాంకుల్లో మొండి బకాయిలు (ఎన్‌పీఏ) పెరిగిపోవడంపై ఆర్‌బీఐ గవర్నర్ ఆందోళన వ్యక్తం చేశారు. వీటి కట్టడికి ఆర్‌బీఐ పలు చర్యలు తీసుకుందని, మరికొన్ని చర్యలు తీసుకోబోతోందని పేర్కొన్నారు. అయితే ఉత్పాదక రంగాలకు రుణ లభ్యతను ఎప్పుడూ అందుబాటులో ఉంచడం కీలకమని వివరించారు.
 
 బంగారంపై మోజు గురించి
 దేశ కరెంట్ అకౌంట్ లోటు (క్యాడ్) పెరిగేందుకు కారణమవుతున్న బంగారంపై భారతీయులకు ఉన్న మోజునూ ఈ సందర్భంగా దువ్వూరి ప్రస్తావించారు. పసిడి అందించే రిటర్న్స్‌కన్నా అధిక రిటర్న్స్ అందించే తగిన ఫైనాన్షియల్ వ్యవస్థను ప్రజలకు అందుబాటులో ఉంచడం ఈ కోణంలో అవసరమని అన్నారు.

మరిన్ని వార్తలు