రాష్ట్రానికి అన్యాయమే!

30 Jun, 2017 07:58 IST|Sakshi
రాష్ట్రానికి అన్యాయమే!

జీఎస్టీతో ఏటా రూ.4,000 కోట్ల లోటు
ఇలా పన్నుల సొమ్ము తగ్గినా పరిహారం దక్కే చాన్స్‌ లేదు
తమ అభ్యర్థనలను కేంద్రం పట్టించుకోకపోవడంపై రాష్ట్రం కినుక
రాజకీయంగా ఆఖరి ఒత్తిడికి ప్రభుత్వ యత్నం
కేంద్రంతో రాజీ పడే ప్రసక్తి లేదన్న మంత్రి ఈటల
ఢిల్లీలో జీఎస్టీ వేడుకలకు హాజరుకానున్న ఆర్థిక మంత్రి  


సాక్షి, హైదరాబాద్‌ : జీఎస్టీ అమలుతో తెలంగాణకు అన్యాయం జరుగుతుందని రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేస్తోంది. పన్నుల రాబడిలోనే ఏటా సుమారు రూ.4,000 కోట్ల లోటు ఏర్పడు తుందని లెక్కలు వేసింది. అంతేగాకుండా రాష్ట్రం తరఫున పంపిన ప్రతిపాదనలపై కేంద్రం నుంచి స్పందన రాకపోవటంతో.. మిషన్‌ భగీరథ, మిషన్‌ కాకతీయ వంటివాటిపై పన్ను రూపేణా వేల కోట్ల రూపాయల భారం పడుతుందని తేల్చింది. ఈ నేపథ్యంలో ఆయా ప్రతిపాదనలపై కేంద్రాన్ని ఒప్పించేందుకు రాజకీయంగా ఒత్తిడి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తోంది.

ఏటా రూ.4,000 కోట్లు లోటు!
జీఎస్టీ అమలుతో రాష్ట్ర ఖజానాకు పన్నుల రాబడిలో రూ.4,000 కోట్ల మేర లోటు తప్పదని ప్రభుత్వం అంచనాకు వచ్చింది. ఇలా జీఎస్టీ అమలుతో వచ్చే లోటును కేంద్రం పరిహారం రూపంలో తిరిగి ఇస్తామని హామీ ఇచ్చింది. కానీ 14.5 శాతం కంటే తక్కువ ఆదాయ వృద్ధి ఉన్న రాష్ట్రాలకు మాత్రమేనని మెలిక పెట్టింది. తెలంగాణ రెవెన్యూ మిగులు రాష్ట్రం కావడం, ఆదాయ వృద్ధి 17.9 శాతంగా ఉండడంతో రాష్ట్రానికి జీఎస్టీ పరిహారం దక్కే అవకాశం తక్కువని భావిస్తున్నారు. మరోవైపు ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టులు, అభివృద్ధి పనులు, వివిధ కార్యక్రమాలపై జీఎస్టీ కారణంగా రూ.19,200 కోట్ల మేరకు అదనపు పన్ను భారం పడుతుందని లెక్కలు వేశారు. ఇక జీఎస్టీ శ్లాబ్‌ల ఖరారు సమయంలో తెలంగాణలోని ప్రత్యేక పరిస్థితులను పరిగణనలోకి తీసుకోలేదనే అభిప్రాయాలున్నాయి. దాంతో చేనేత, బీడీ పరిశ్రమపై పెరిగిన పన్ను భారంతో రాష్ట్రంలోని లక్షలాది మంది బీడీ, చేనేత కార్మికులు ఆందోళనకు గురవుతున్నారు. రాష్ట్రంలోని గ్రానైట్‌ పరిశ్రమకు సైతం పన్నుపోటు తగలనుంది. వీటన్నింటికి కొంత మేర మినహాయింపులు ఇవ్వాలని, జీఎస్టీ స్లాబ్‌ను కుదించాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి ప్రతిపాదించింది.

కేంద్రంపై ఒత్తిడి పెంచుతాం: ఈటల
జీఎస్టీకి సంబంధించి రాష్ట్రం చేసిన కొన్ని ప్రతిపాదనలపై కేంద్రం సానుకూల నిర్ణయం తీసుకున్నా.. మరికొన్నింటిని తోసిపుచ్చిందని ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్‌ చెప్పారు. ఈ విషయంలో తాము రాజీపడబోమని, కేంద్రంపై ఒత్తిడి తీసుకువస్తామని తెలిపారు. ఇప్పటికే ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆరు అంశాలపై కేంద్రానికి లేఖ రాశారని.. మిషన్‌ భగీరథ, మిషన్‌ కాకతీయ, బీడీ, చేనేత, సాగునీటి రంగాలకు పన్ను మినహాయింపు ఇవ్వాలని ప్రతిపాదించారని వెల్లడించారు.

ఫిర్యాదులుంటే కాల్‌ చేయండి
జీఎస్టీ అమలును సాకుగా చూపి ధరలు పెంచొద్దని వ్యాపార, వాణిజ్య వర్గాలకు మంత్రి ఈటల సూచించారు. అనుమానాలు, అపోహలు వద్దని.. ప్రస్తుతమున్న వ్యాట్‌ తరహాలోనే పారదర్శకంగా పన్నులు, పన్నుల చెల్లింపు విధానం ఉంటుందని పేర్కొన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో వ్యాట్‌ పరిధిలో 2.25 లక్షల మంది ఉన్నారని, జీఎస్టీతో డీలర్ల సంఖ్య పెరిగే అవకాశముందని చెప్పారు. జీఎస్టీ అమలుకు సంబంధించి ఏవైనా ఇబ్బందులు ఎదురైతే తమ దృష్టికి తీసుకు రావాలని సూచించారు. దేశంలో అత్యధి కంగా వాణిజ్య పన్నుల రాబడి ఉన్న రాష్ట్రం తెలంగాణ అని, అందుకే రాష్ట్ర ప్రజలు, వ్యాపార వాణిజ్య వర్గాలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. ఎవరైనా అనుమానా లుంటే 18004253787 టోల్‌ఫ్రీ నంబర్‌కు ఫోన్‌ చేసి ఫిర్యాదు చేయాలని చెప్పారు.

ఎక్సైజ్‌పై ప్రభావం లేకుండా..
జీఎస్టీ అమల్లోకి వస్తున్న నేపథ్యంలో రాష్ట్రానికి వచ్చే ఎక్సైజ్‌ ఆదాయంలో కోత పడకుండా ఉండేందుకు ఎక్సైజ్‌ చట్టం– 1968కు పలు సవరణలు చేస్తూ ప్రభుత్వం ఆర్డినెన్స్‌ జారీ చేసింది. ఎక్సైజ్‌ సర్వీస్‌ టాక్స్‌ పరిధిలోకి వచ్చే అంశాలను జీఎస్టీ పరిధిలోకి రాకుండా ఉండేలా ఈ సవరణ లు చేసినట్లు ప్రభుత్వ వర్గాలు తెలి పాయి. మరోవైపు కొత్త జిల్లాలు ఏర్పడ టంతో ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ పోస్టును ఎక్సైజ్‌ ఆఫీసర్‌గా మారుస్తూ సవరణ చేసింది.
 

>
మరిన్ని వార్తలు