ఫీజులపై మరో ‘సారీ’!

11 Jul, 2017 04:17 IST|Sakshi
ఫీజులపై మరో ‘సారీ’!

- ఈసారి కూడా స్కూల్‌ ఫీజుల నియంత్రణ అటకెక్కినట్టే!
- మొన్నటి వరకు గుజరాత్‌లో అధ్యయనం అన్నారు..
- ఇప్పుడు స్కూళ్ల మూడేళ్ల ఆదాయ వ్యయాల పరిశీలన
- అసలు విధానమే రూపొందించకుంటే యాజమాన్యాలు లెక్కలు చెబుతాయా?... పైగా ఆదాయ వ్యయాల అధ్యయనం తరువాత విధానం రూపకల్పనా?
- ఇప్పటికే ఉన్న జీవోల అమలును పట్టించుకోరెందుకు?
- ఎనిమిదేళ్లుగా నానుతున్న ఫీజుల నియంత్రణ వ్యవహారం


సాక్షి, హైదరాబాద్‌:

రాష్ట్రంలోని ప్రైవేటు పాఠశాలల్లో ఫీజుల నియంత్రణ ఈసారి కూడా అమల్లోకి వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. దీనిపై ఎనిమిదేళ్లుగా కసరత్తు జరుగుతున్నా ప్రతిసారీ ఏదో ఓ కారణంతో ఆగిపోతూనే ఉంది. తొలుత న్యాయ వివాదాలు, కొన్నిసార్లు విద్యాశాఖ అలసత్వం, మరికొన్నిసార్లు అధ్యయనాల పేరుతో వాయిదా పడుతూ రాగా... ఈసారి కూడా మరో అధ్యయనం పేరుతో జాప్యం జరుగుతోంది. మొత్తంగా కార్పొరేట్, ప్రైవేటు పాఠశాలల ఒత్తిడికి తలొగ్గిన ప్రభుత్వం.. ఇప్పట్లో ఫీజుల నియంత్రణకు విధానాన్ని అమల్లోకి తెచ్చేలా కనిపించడం లేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

విధానం రూపొందించేదెప్పుడు?
గతేడాది ఫీజుల నియంత్రణ అంశంపై విద్యాశాఖ ఓ అడుగు ముందుకు వేసినా ఆచరణకు నోచుకోలేదు. దాంతో విద్యార్థులపై అడ్డగోలుగా ఫీజుల భారం తప్పలేదు. ఈసారైనా ఫీజుల నియంత్రణకు చర్యలు చేపడతారని భావించినా ఫలితం వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. ప్రభుత్వం పాఠశాలలు ప్రారంభమవుతాయన్న తరుణంలో మార్చిలో ఫీజుల నియంత్రణపై ప్రొఫెసర్‌ తిరుపతిరావు కమిటీని ఏర్పాటు చేసింది. నెల రోజుల్లో నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం సూచించినా.. అధ్యయనానికి మరింత సమయం కావాలంటూ కమిటీ గత నెలాఖరు వరకు జాప్యం చేసింది. ఇక గుజరాత్‌తో అధ్యయనం చేసి.. ఆ తరహా చట్టం రూపొందించేందుకు కసరత్తు చేస్తున్నట్లు ఈ నెల మొదట్లో ప్రభుత్వం పేర్కొంది. తాజాగా గత మూడేళ్ల ఆదాయ, వ్యయాల వివరాలు ఇవ్వాలంటూ ప్రైవేటు పాఠశాలలకు ఆదేశాలు జారీ చేసింది. వాటిని అధ్యయనం చేసి విధానం రూపొందిస్తామని చెబుతోంది. అసలు ఫీజులకు సంబంధించి ప్రభుత్వం ఎలాంటి విధానమూ రూపొందించకుండానే.. ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు లెక్కలు ఎలా చెబుతాయన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఒకవేళ యాజమాన్యాలు లెక్కలు చెప్పినా... దాదాపు 11 వేలకుపైగా ఉన్న పాఠశాలల మూడేళ్ల ఆదాయ వ్యయాలను పరిశీలించేదెప్పుడు? విధానం రూపొందించేది ఎప్పుడనేది ప్రశ్నార్థకంగా మారింది. మరోవైపు ఈ ఏడాది ప్రైవేటు పాఠశాలలు ఇప్పటికే ఏకంగా 30 శాతం నుంచి 40 శాతం వరకు ఫీజులను పెంచేయడం గమనార్హం.

ఏళ్ల తరబడి సాగదీత..
2009లో ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం ఫీజుల నియంత్రణకు జీవో 91, 92లను జారీ చేసింది. ఆ నిబంధనల ప్రకారం.. ప్రతి ప్రైవేటు పాఠశాలలో గవర్నింగ్‌ బాడీలను ఏర్పాటు చేయాలి. జిల్లాస్థాయిలో జిల్లా ఫీజుల నియంత్రణ కమిటీలను (డీఎఫ్‌ఆర్‌సీ) ఏర్పాటు చేయాలి. పాఠశాల గవర్నింగ్‌ బాడీలు ప్రతిపాదించే ఫీజులను డీఎఫ్‌ఆర్‌సీ పరిశీలించి తుది ఫీజులను ఖరారు చేయాలి. వాటినే స్కూళ్లలో వసూలు చేయాలి. అంతేకాదు గరిష్టంగా వసూలు చేయాల్సిన ఫీజులను కూడా ప్రభుత్వం ఆ జీవోలలో స్పష్టంగా పేర్కొంది. ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో ఏటా గరిష్టంగా రూ.24 వేలు, ఉన్నత పాఠశాలల్లో రూ.30 వేలు ట్యూషన్‌ ఫీజు మాత్రమే వసూలు చేసుకోవచ్చని పేర్కొంది. కానీ దీనిపై ప్రైవేటు పాఠశాలలు హైకోర్టును ఆశ్రయించగా.. డీఎఫ్‌ఆర్‌సీల ఏర్పాటు సరిగ్గా లేదంటూ 2010లో హైకోర్టు తీర్పు ఇచ్చింది. తరువాత విద్యాహక్కు చట్టం అమల్లోకి రావడంతో ప్రభుత్వం జీవో 91, 92లను పక్కన పడేసి జీవో 41, 42లను జారీ చేసింది. ఈ జీవోల ప్రకారం... ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో పట్టణ ప్రాంతాల్లోనైతే గరిష్టంగా రూ.9 వేలు, గ్రామీణ ప్రాంతాల్లో రూ.7,800 వార్షిక ఫీజుగా వసూలు చేయాలని పేర్కొంది. ఉన్నత పాఠశాలల్లో పట్టణాల్లోనైతే రూ.12 వేలు, గ్రామాల్లో రూ.10,800కు మించి వార్షిక ఫీజు వసూలు చేయవద్దని స్పష్టం చేసింది. ఈ జీవోలపైనా ప్రైవేటు యాజమాన్యాలు కోర్టును ఆశ్రయించాయి. దీంతో జీవోల అమలు ఆగిపోయింది. తర్వాత కూడా ప్రతి విద్యా సంవత్సరం ప్రారంభంలో ప్రభుత్వం హడావుడి చేయడం, ఆగిపోవడం పరిపాటిగా మారింది.

హైకోర్టు ఆదేశాలతో కదలిక..
ప్రైవేటు పాఠశాలలు ఇష్టారాజ్యంగా ఫీజులు వసూలు చేస్తుంటే ప్రభుత్వం ఏం చేస్తోందం టూ గతేడాది ఫిబ్రవరిలో ఓ పిల్‌ విచారణ సందర్భంగా హైకోర్టు నిలదీసింది. దాంతో విద్యాశాఖ నామమా త్రంగా 162 స్కూళ్లకు నోటీసులిచ్చి మిన్నకుండిపోయింది. ఆ స్కూళ్లపై ఏ చర్యలు తీసుకున్నారన్న వివరా లూ బయటికి రాలేదు. అయితే మళ్లీ అదే కేసుపై విచారణ ఉండటంతో గతేడాది సెప్టెం బర్‌లో విద్యాశాఖ కార్యాచరణకు దిగింది.

నెలల తరబడి చేసిన కసరత్తు వృథా..
పాఠశాల విద్య కమిషనర్‌ స్వయంగా తల్లిదండ్రుల కమిటీలు, ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలతో పలు దఫాలుగా చర్చించారు. వారి సూచనలు, సలహాలు స్వీక రించి.. ఫీజుల నియంత్రణకు చేపట్టాల్సిన చర్యలపై ఈ ఏడాది జనవరిలో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. కానీ ఆ ప్రతిపాదనలను పక్కన పెట్టిన ప్రభుత్వం.. ప్రొఫెసర్‌ తిరుపతిరావు కమిటీని ఏర్పాటు చేస్తూ మార్చి 21న ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో వ్యవహారం మళ్లీ మొదటికి వచ్చింది. తిరుపతిరావు కమిటీ మళ్లీ తల్లిదండ్రుల సంఘాలు, పాఠశాలల యాజమాన్యాలతో చర్చలు ప్రారంభిం చారు. ఎవరి వాదనలు వారు వినిపించ డంతో అవి ఓ కొలిక్కి రాలేదు. ఆదాయ వ్యయాలను బట్టి ఫీజులను నిర్ణయిం చేందుకు ‘ప్రవేశాలు– ఫీజుల నియంత్రణ కమిటీ (ఏఎఫ్‌ఆర్‌సీ)’తరహా కమిటీ ఏర్పాటు చేయాలని.. జీవో నంబర్‌ 1లోని నిబంధనలు కచ్చితంగా పాటించాలని తల్లిదండ్రుల కమిటీలు విజ్ఞప్తి చేశాయి. మరోవైపు శ్లాబ్‌ల విధానంలో ఫీజులు ఉండా లని ప్రైవేటు యాజమాన్యాలు కోరాయి. ఇదిలా ఉండగానే... ప్రైవేటు స్కూళ్లు మూడేళ్ల ఆదాయ, వ్యయాల వివరాలు ఇవ్వాలని.. వాటి ఆధారంగా ఫీజుల నియంత్రణ విధానాన్ని రూపొందిస్తామని సర్కారు కొత్త వాదనను తెరపైకి తెచ్చింది. ఇది మరింత జాప్యానికి అవకాశం కల్పించింది.

30 లక్షల మందిపై భారం
రాష్ట్రంలో మొత్తంగా 41,337 పాఠశా లలు ఉండగా వాటిలో 5,86,67,586 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఇందులో ప్రైవేటు పాఠశాలలు 11,372 కాగా వాటిలోని విద్యార్థులు 30,08,185 మందిగా విద్యాశాఖ లెక్కలు వేసింది. ఇంత పెద్ద సంఖ్యలో విద్యార్థులకు భారంగా మారిన ఫీజులను నియంత్రించడంపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందనే విమర్శలు వస్తున్నాయి. ఫలితంగా తల్లిదండ్రులపై ఫీజుల భారం తప్పడం లేదు.

జీవో నంబర్‌ 1 అమలు చేయరా?
ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం 1994లో జారీ చేసిన జీవో నంబర్‌ 1 ప్రకారం ప్రైవే టు పాఠశాలలకు ఫీజుల రూపంలో వచ్చే ఆదాయంలో 50 శాతాన్ని ఉపాధ్యాయుల వేతనాలకు, 15 శాతం  పాఠశాల అభివృద్ధి, వసతుల కల్పన, 15 శాతం పాఠశాల నిర్వహణ, మరో 15 శాతం నిధులను ఉపాధ్యాయులు, సిబ్బంది సంక్షేమం కోసం ఉపయోగించాలి. యాజమాన్యం 5 శాతాన్ని మాత్రమే లాభంగా తీసుకోవాలి. కానీ ఈ నిబంధనల అమలును అధికా రులు పట్టించుకోవడం మానేశారు.

మరిన్ని వార్తలు