-

తాత్కాలిక కొలువుల పందేరం!

24 Sep, 2015 01:53 IST|Sakshi

విద్యుత్ సంస్థల్లో ‘తాత్కాలికం’ పేరిట అడ్డగోలు నియామకాలు
కాంట్రాక్టు టెక్నికల్ అసిస్టెంట్లుగా ఇంజనీర్లకు ఉద్యోగాలు
నోటిఫికేషన్లు, రాత పరీక్షలు లేకుండా నేరుగా ఉత్తర్వులు
జీతాలు నేరుగా చెల్లిస్తుండటంతో భవిష్యత్తులో క్రమబద్ధీకరించే అవకాశం
ట్రాన్స్‌కో, జెన్‌కోల్లో దొడ్డిదారిలో 50 మందికిపైగా కొలువులు

సాక్షి, హైదరాబాద్: ఉద్యోగ ప్రకటన లేదు.. ఏ పరీక్షా లేదు.. రిజర్వేషన్లు అంతకన్నా లేవు.. రోస్టర్ పాయింట్ల లేనే లేవు. అసలు నిబంధనల ఊసే లేదు.ఉన్నత స్థాయిలో పైరవీలతో నేరుగా ఉద్యోగ నియామకాలు జరిగిపోతున్నాయి. తెలంగాణ విద్యుత్ సంస్థల్లో ‘తాత్కాలికం’ పేరిట దొడ్డిదారిలో కొలువులు ఇస్తున్నారు. కాంట్రాక్టు టెక్నికల్ అసిస్టెంట్ పోస్టుల పేరుతో పెద్ద సంఖ్యలో ఇంజనీరింగ్ పట్టభద్రులను నియమిస్తున్నారు.
 
50 మంది నియామకం..
విద్యుత్ సౌధ కేంద్రంగా పనిచేస్తున్న తెలంగాణ ట్రాన్స్‌కో, జెన్‌కో ప్రధాన కార్యాలయాల పరిధిలో ఇప్పటి వరకు 50 మంది ఇంజనీర్లను కాంట్రాక్టు టెక్నికల్ అసిస్టెంట్ల పేరుతో తాత్కాలిక ప్రాతిపదికన నియమించారు. అధికార పార్టీ ముఖ్య నేతలు, పలువురు మంత్రుల సిఫారసుతో వీరికి ఉద్యోగాలు ఇచ్చారు. జెన్‌కోలో 30 మందికి, ట్రాన్స్‌కోలో 20 మందికి టెక్నికల్ అసిస్టెంట్ పేరుతో ఉద్యోగావకాశాలు కల్పించినట్లు చర్చ జరుగుతోంది.

వీరిలో కొందరిని 6 నెలలు, మరికొందరిని ఏడాది కాలానికీ ఉద్యోగాల్లోకి తీసుకున్నప్పటికీ.. కాలపరిమితి తీరిన ప్రతీసారి పొడిగించే అవకాశాలు ఉన్నాయి. రిజర్వేషన్లు, రోస్టర్ పాయింట్లను సైతం ఖాతరు చేయకుండా నియామకాలు చేసేశారు. నియామకాలు ఎంత అడ్డగోలుగా జరిగాయో.. వేతనాలను సైతం అంతే అశాస్త్రీయంగా నిర్ణయించారు. పోస్టులు, అర్హతలు ఒకేలా ఉన్నా.. సిఫారసు చేసిన నేతల స్థాయినిబట్టి జీతాలను ఖరారు చేసినట్లు తెలుస్తోంది.

ముఖ్య నేతలు సిఫారసు చేస్తే.. గరిష్టంగా రూ.35 వేలు.. మిగిలిన వారికి రూ.30 వేలు, రూ.25 వేలు, కనిష్టంగా రూ.20 వేల జీతం నిర్ణయించారు. తాత్కాలిక ఉద్యోగులైనా రెగ్యులర్ ఉద్యోగుల మాదిరిగా విద్యుత్ సంస్థలే నేరుగా జీతాలు చెల్లిస్తుండడం అనుమానాలు కలిగిస్తోంది. పెద్ద పోస్టుల భర్తీలోనూ విద్యుత్ సంస్థలు ప్రతిభకు పాతరేశాయి. ఇటీవల తెలంగాణ జెన్‌కో కాంట్రాక్టు లా ఆఫీసర్ పేరుతో ఓ న్యాయవాదిని ఎలాంటి ఉద్యోగ ప్రకటనా లేకుండా నేరుగా నియమించడం గమనార్హం.

ఒకవైపు ఏఈ, సబ్ ఇంజనీర్ల నియామకాల కోసం విద్యుత్ సంస్థలు కసరత్తు చేస్తూనే.. మరోవైపు తాత్కాలిక పద్ధతుల్లో ఇంజనీర్లను నియమించుకోవడం చర్చనీయాంశమైంది. ఏఈ, ఎస్‌ఈల రిక్రూట్‌మెంట్లలో సైతం పైరవీలకు ఆస్కారముందని, కొందరు ఇప్పటికే వసూళ్లకు తెరలేపడంతో ఇటీవల విద్యుత్ శాఖ నష్టనివారణ చర్యలకు ఉపక్రమించింది. వసూళ్లకు పాల్పడుతున్న వ్యక్తులపై ఫిర్యాదు చేయాలని అభ్యర్థులకు సూచించింది.

కాంట్రాక్టు ఉద్యోగుల నియామకాల కోసం సాధారణ పరిపాలన శాఖ జారీ చేసిన మార్గదర్శకాలు(జీవో ఎంఎస్ నం.94)
రెగ్యులర్, కాంట్రాక్టు ఉద్యోగులకు ప్రత్యేక రోస్టర్‌ను మెయింటెయిన్ చేయాలి.
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళలు, వికలాంగులకు రిజర్వేషన్లు అమలు చేయాలి.
రెగ్యులర్ నియామకాలు జరిపే నియామక సంస్థే కాంట్రాక్టు నియామకాలకు బాధ్యత వహించాలి. ఉద్యోగ నియామక ప్రకటన జారీతో పాటు ప్రతిభ ఆధారంగా నియామకాలు చేయాలి.

మరిన్ని వార్తలు