‘పాలమూరు’కు టెండర్ నోటిఫికేషన్

18 Jan, 2016 02:26 IST|Sakshi

* ఈ నెల 25 నుంచి అందుబాటులో టెండర్ డాక్యుమెంట్
* ఫిబ్రవరి 10 వరకు టెండర్ల స్వీకరణ.. పనులు పూర్తికి 30 నెలల గడువు

సాక్షి, హైదరాబాద్: ప్రతిష్టాత్మక పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనుల టెండర్లకు నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తంగా రూ. 24 వేల కోట్ల విలువైన ఈ పనులను 15 ప్యాకేజీలుగా విభజించి.. కాంట్రాక్టర్ల నుంచి టెండర్లను ఆహ్వానించారు. ఈనెల 25 నుంచి టెం డర్ డాక్యుమెంట్లు అందుబాటులో ఉంటాయి. వచ్చే నెల 10 వరకు టెండర్లను స్వీకరిస్తారు.

మొత్తం పనులను 30 నెలల్లో పూర్తి చేయాలని గడువు నిర్దేశించారు. మహబూబ్‌నగర్, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాల్లోని 62 మండలాల పరిధిలో 10 లక్షల ఎకరాలకు సాగునీరిచ్చేందుకు పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును చేపట్టిన విషయం తెలిసిందే. రంగారెడ్డి జిల్లాలో నిర్మించే కేపీ లక్ష్మీదేవునిపల్లి రిజర్వాయర్ మినహా ప్రాజెక్టులోని ఐదు రిజర్వాయర్లు, వాటికి అనుసంధానంగా నిర్మించే టన్నెల్, కాల్వల అంచనాలు ఇప్పటికే సిద్ధమయ్యాయి.

వీటికి సంబంధించి సివిల్, ఎలక్ట్రో మెకానికల్ పనులను విభజించాలన్న సూచనను పక్కనపెట్టి, అన్ని పనులకు ఒకే టెండర్ పిలవాలని నిర్ణయించారు. ఈ టెండర్ పనులను వెంటనే పూర్తిచేయాలన్న ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆదేశాల మేరకు... అధికారులు ప్యాకేజీల్లో చిన్నచిన్న మార్పులు చేసి టెండర్లకు నోటిఫికేషన్ విడుదల చేశారు. ప్యాకేజీ-8లో భాగంగా వట్టెం గ్రామం వద్ద నిర్మించనున్న వెంకటాద్రి జలాశయం పనులకు గరిష్టంగా రూ. 4,303.37 కోట్లతో టెండర్ పిలవగా... కనిష్టంగా ప్యాకేజీ-3లో ఉన్న నార్లపూర్ వద్ద నిర్మించే అంజనగిరి జలాశయానికి రూ. 391.50 కోట్లతో టెండర్ పిలిచారు.

మరిన్ని వార్తలు