నేపాల్‌కు తొలి అధ్యక్షురాలు

29 Oct, 2015 11:49 IST|Sakshi
నేపాల్‌కు తొలి అధ్యక్షురాలు

కమ్యూనిస్టు విద్యాదేవిని ఎన్నుకున్న పార్లమెంట్
 
 కఠ్మాండూ: నేపాల్ తొలి మహిళా అధ్యక్షురాలిగా ప్రముఖ కమ్యూనిస్టు నాయకురాలు విద్యాదేవి భండారీ బుధవారం ఎన్నికయ్యారు. నేపాల్ రిపబ్లిక్ తొలి రాజ్యాంగం అవతరించిన కొద్ది వారాలకే విద్యాదేవి అధ్యక్షురాలిగా ఎన్నికకావడం విశేషం. 54 ఏళ్ల విద్యాదేవి సీపీఎన్-యూఎంఎల్ పార్టీకి ఉపాధ్యక్షురాలిగా కూడా వ్యవహరిస్తున్నారు. ఆమె కమ్యూనిస్టు ప్రముఖుడు దివంగత మదన్ భండారీ సతీమణి. ఆమె ఎన్నికను పార్లమెంటు స్పీకర్ ఒన్సారీ ఘర్తీ మగర్ ప్రకటించారు. ఆమె నేపాలీ కాంగ్రెస్ సీనియర్ నేత కుల్‌బహదూర్ గురంగ్‌పై 113 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు.

నేపాల్ తొలి అధ్యక్షుడు రామ్‌బరణ్ యాదవ్ తర్వాత ఈ అత్యున్నత పీఠానికి విద్యాదేవి ఎన్నికై రికార్డు నెలకొల్పారు. ఈ సందర్భంగా ఎన్నికైన అధ్యక్షురాలు విద్యాదేవి మాట్లాడుతూ నేపాల్ కొత్త రాజ్యాంగం దేశ సార్వభౌమత్వ పరిరక్షణకు, స్వేచ్ఛకు దోహదపడేలా తన హయాంలో కృషిచేస్తానని వెల్లడించారు. సంకీర్ణ ప్రభుత్వానికి సారథ్యం వహిస్తున్న ప్రధాని ఖడ్గప్రసాద్ ఓలీకి ఆమె స్నేహితురాలు. ఆమె వామపక్ష రాజకీయాల్లో చురుగ్గా పాల్గొనేవారు. విద్యార్థి ఉద్యమాలతో తన రాజకీయ ప్రస్థానాన్ని 1979లో ప్రారంభించారు. ఆమె రెండుసార్లు పార్లమెంటుకు కూడా ఎన్నికయ్యారు.

మరిన్ని వార్తలు