'రెహ్మాన్.. మళ్లీ ఇంటికి వచ్చేయ్'

17 Sep, 2015 16:02 IST|Sakshi
'రెహ్మాన్.. మళ్లీ ఇంటికి వచ్చేయ్'

న్యూఢిల్లీ: హిందూ మతంలోకి మారాలని ప్రఖ్యాత సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ ను విశ్వ హిందూ పరిషత్(వీహెచ్ పీ) ఆహ్వానించింది. రెహ్మాన్ కు 'ఘర్ వాపసీ' సమయం ఆసన్నమైందని వీహెచ్ పీ ప్రధాన కార్యదర్శి సురేంద్ర జైన్ అన్నారు. ఆయనకు హిందువులు స్వాగతిస్తున్నారని చెప్పారు.

'రెహ్మాన్ కు వ్యతిరేకంగా ఫత్వా జారీచేయడం దురదృష్టకరం. ఆయనపై ప్రతీకారం తీర్చుకుంటామని వాడిన భాష మరింత దురదృష్టకరం. మత ఆధారంగా ఆ సినిమాకు రెహ్మాన్ సంగీతం అందించలేదు. హిందూమతంలోకి రెహ్మాన్ మారాల్సిన సమయం ఆసన్నమెంది. హిందూ సమాజం ఆయన కోసం ఎదురు చూస్తోంది. మనస్ఫూర్తిగా ఆయనకు స్వాగతం చెబుతోంది. ఎన్ని ఫత్వాలు జారీచేసినా ఆయనకు ఎటువంటి హాని కలగకుండా కాపాడుకుంటామని హామీయిస్తున్నామ'ని జైన్ అన్నారు.

ఇస్లాం, క్రైస్తవ మతంలోకి మారిన వారిని తిరిగి హిందువులుగా మార్చే లక్ష్యంతో వీహెచ్ పీ వివాదస్పద 'ఘర్ వాపసీ' కార్యక్రమం చేపట్టింది. ఇరాన్ సినిమా మహ్మద్- మెసెంజర్ ఆఫ్ గాడ్ కు సంగీతం అందించినందుకు ఏఆర్ రెహ్మాన్ కు సున్నీ ముస్లిం గ్రూపు రజా అకాడమీ ఫత్వా జారీ చేసిన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు