దేశ రాజధానిలో మాంసం కొరత

29 Mar, 2017 18:13 IST|Sakshi
దేశ రాజధానిలో మాంసం కొరత

న్యూఢిల్లీ: పొరుగు రాష్ట్రం ఉత్తరప్రదేశ్‌ లో మాంసం వ్యాపారులు బంద్‌కు దిగడంతో దేశ రాజధాని ఢిల్లీలో మాంసం కొరత ఏర్పడింది. ప్రస్తుతం నవరాత్రి వేడుకలు జరుగుతున్నందున హిందువులు మాంసం తినరు కాబట్టి పెద్దగా ఇబ్బంది లేదనీ, పండుగ ముగిశాక మాత్రం కొరత తీవ్రం అవుతుందని అక్కడి వారు అంటున్నారు. నవరాత్రి పండుగ ముగిశాక మాంసం ధరలు కూడా ఒక్కసారిగా భారీగా పెరిగే అవకాశాలున్నాయని చెబుతున్నారు.

యూపీలో అక్రమ కబేళాలపై ప్రభుత్వం కఠిన చర్యలకు దిగడంతో మాంసం విక్రేతలు సోమవారం నుంచి నిరవధిక బంద్‌ పాటిస్తుండటం తెలిసిందే. ప్రస్తుతం యూపీ నుంచి ఢిల్లీకి గొర్రెల సరఫరా పూర్తిగా నిలిచిపోయిందనీ, కేవలం పంజాబ్, రాజస్థాన్, హరియాణ రాష్ట్రాల నుంచి వచ్చే గొర్రెల మీదే ఆధారపడుతున్నామని ఢిల్లీ మాంసం వ్యాపారులు చెబుతున్నారు.

వ్యాపారం చేయడానికి తమకు లైసెన్సులు ఉన్నప్పటికీ దాడులు జరుగుతాయన్న భయంతో గొర్రెలను సరఫరా చేయడానికి హోల్ సేల్ మాంసం వ్యాపారులు జంకుతున్నారు. యూపీ మాంసం వ్యాపారులు బంద్‌ ప్రభావం చికెన్, మటన్ సరఫరాపై పెద్దగా లేదని, బీఫ్ సరఫరా నిలిచిపోయిందని ఇండియా హోటళ్లు, రెస్టారెంట్స్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు గారిశ్ ఒబెరాయ్ తెలిపారు. 

మరిన్ని వార్తలు