బ్రసెల్స్ దాడి జరిగిన రోజే లండన్ లో...

23 Mar, 2017 09:06 IST|Sakshi
బ్రసెల్స్ దాడి జరిగిన రోజే లండన్ లో...

లండన్: బ్రిటన్ పార్లమెంట్ లక్ష్యంగా జరిగిన ఉగ్రదాడిలో ఐదుగురు మృతి చెందారు. కనీసం 40 మంది గాయపడ్డారు. ఉగ్రవాది, పోలీసు అధికారితో సహా ఐదుగురు మృతి చెందారని లండన్ పోలీసులు తెలిపారు. థేమ్స్‌ బ్రిడ్జిపై కారుతో బీభత్సం సృష్టించి, పోలీసు అధికారిని పొడిచి చంపిన ఉగ్రవాదిని గుర్తించినట్టు చెప్పారు. అయితే అతడి వివరాలు వెల్లడించబోమని చెప్పారు.

చనిపోయిన పోలీసు అధికారి పేరు పీసీ కీత్ పామర్ అని, దాడి సమయంలో ఆయన దగ్గర ఎటువంటి ఆయుధాలు లేదని తెలిపారు. పార్లమెంట్‌ ప్రధాన ద్వారం వద్ద ఆయనను ఉగ్రవాది కత్తితో పొడిచి చంపాడు. మరో అధికారిని పొడవబోతుండగా ఉగ్రవాదిని భద్రతా సిబ్బంది హతమార్చారు. దుండగుడి వద్ద మూడు కత్తులు ఉన్నట్టు పోలీసులు వెల్లడించారు. పార్లమెంట్ చుట్టూ ఉన్న వీధులను పోలీసులు తమ అధీనంలోకి తీసుకున్నారు.

ఈ దాడిని టెర్రర్‌ అటాక్‌ గానే భావిస్తున్నామని లండన్ మెట్రో పాలిటన్ పోలీసు ట్విటర్ పేజీలో ట్వీట్ చేశారు. గాయపడిన వారిలో 15 నుంచి 16 ఏళ్ల వయసున్న ముగ్గురు పిల్లలు ఉన్నట్టు అధికారులు తెలిపారు. బెల్జియం రాజధాని బ్రసెల్స్ లో ఉగ్రదాడి జరిగి ఏడాది పూర్తయిన సందర్భంగా ఈ దాడి జరిగినట్టు అనుమానిస్తున్నారు. 2016, మార్చి 22న బ్రసెల్స్ లో ఉగ్రవాదులు సాగించిన మారణహోమంలో 32 మంది మృతి చెందారు. దాడులకు తెగబడిన ముగ్గురు ఉగ్రవాదులను భద్రతా దళాలు హతమార్చాయి.

సంబంధిత వార్తలు ఇక్కడ చదవండి:

బ్రిటన్‌ పార్లమెంట్‌పై టెర్రర్‌ అటాక్‌

లండన్ లో దాడి బాధాకరం: ప్రధాని మోదీ

లండన్‌ టెర్రర్‌ అటాక్‌: భారతీయులు సేఫ్‌!

>
మరిన్ని వార్తలు